ఆటోవాలా ఇంటికి సీఎం.. నేలపై కూర్చొని భోజనం

ఆటోవాలా ఇంటికి సీఎం.. నేలపై కూర్చొని భోజనం

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి తన సింపుల్ సిటీ చాటుకున్నారు. తాను ఎంతో సామాన్య వ్యక్తినని.. నలుగురిలో కలిసిపోయే సీఎంనని నిరూపించుకున్నారు. ఓ ఆటోవాలా ఆహ్వానం మేరకు అతని ఇంటికి వెళ్లిన సీఎం.. అక్కడ వారు వండి వడ్డించిన భోజనాన్ని ఆరగించారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. త్వరలో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ ఆప్ జెండా ఎగురవేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో లూథియానాలో పర్యటించిన కేజ్రీ అక్కడ ఆటోడ్రైవర్లతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశం జరుగుతుండగా.. ఓ ఆటోవాలా నిలబడి...‘సార్ మీరు మా ఆటోడ్రైవర్ల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నేను మీకు పెద్ద అభిమానిని. మీరు మా ఇంటికి భోజనానికి వస్తారా ’అంటూ సీఎంను కోరాడు. దీంతో అతడి కోరిక మేరకు సీఎం కేజ్రీ స్పందిస్తూ... ఇవాళ రాత్రికి ఓకేనా? అంటూ బదులిచ్చారు. తనతో పాటు మరో ఇద్దర్ని కూడా మీ ఇంటికి భోజనానికి తీసుకు రావచ్చా ? అంటూ సీఎం అడిగారు. దీనికి ఆటోవాలా తప్పకుండా తీసుకురండి అన్నారు. అయితే తానే స్వయంగా తన ఆటోలో అందర్నీ తన ఇంటికి భోజనానికి తీసుకెళ్తానంటూ... ఆ ఆటో వాటా సీఎంను కోరాడు. తప్పకుండా వస్తాను అంటూ కేజ్రీ అతనికి సమాధానం ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం రాత్రి ఆటోవాలా ఇంటికి భోజనానికి వెళ్లారు కేజ్రీవాల్. తనతో పాటు మరో ఇద్దరు నాయకుల్ని కూడ వెంట తీసుకు వెళ్లారు. నేలపై కూర్చొని భోజనం ఆరగించారు. భోజనం ఎలా ఉంది ? అని ఆటోవాలా భార్య అడగ్గానే.. సీఎంతో పాటు... మిగిలిన నేతలు కూడా చాలా రుచిగా ఉందని ఆమెకు చెప్పారు. భోజనం తర్వాత వారి కుటుంబతో కాసేపు మచ్చటించారు. ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ కుటుంబం చూపించిన ప్రేమాభిమానాలకు ముగ్దుడినయ్యానని.. భోజనం చాలా బాగుందని చెప్పారు. ఇక దిలీప్ తివారీ కుటుంబాన్ని ఢిల్లీలోని తన ఇంటికి రావాలని ఆహ్వానించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ భోజనం చేసిన ఫోటోలను ఆమ్ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి.