ఢిల్లీలో 2025లో కాదు.. 2050లోనూ బీజేపీ గెలవదు : కేజ్రీవాల్

ఢిల్లీలో 2025లో కాదు.. 2050లోనూ బీజేపీ గెలవదు :  కేజ్రీవాల్
  • ఢిల్లీలో 2025లో కాదు.. 2050లోనూ బీజేపీ గెలవదు
  • అవినీతిపరులంతా ఆ పార్టీలోనే చేరిన్రు: సీఎం కేజ్రీవాల్ ఆరోపణ
  • విశ్వాస తీర్మానంలో నెగ్గిన ఆప్

న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీ దాడుల నుంచి తప్పించుకునేందుకు అవినీతిపరులంతా బీజేపీలో చేరిపోయారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ పాలన అంతమైతేనే దేశం అవినీతిరహితంగా మారుతుందన్నారు. ఢిల్లీలో ఎప్పటికైనా ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. 2025లో కాదు 2050లో కూడా ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాదన్నారు. అరెస్ట్​ చేస్తామంటూ ఆప్ ఎమ్మెల్యేలను బెదిరించి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. అయినా తమ ఎమ్మెల్యేలు లొంగలేదని, దీంతో బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని విరమించుకుందని తెలిపారు. దీంతో తామే బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెట్టి బలం నిరూపించుకున్నామని వివరించారు. తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతామన్నారు. అవిశ్వాస తీర్మానానికి 14 సీట్లు అవసరం కాగా.. బీజేపీకి ఎనిమిది మంది సభ్యులే ఉన్నారన్నారు. 

అవినీతిపరులంతా ఒకే పార్టీలో ఉన్నరు

అవినీతిపరులంతా ఒక్కటయ్యారని ప్రధాని మోడీ అంటున్నారని, ఆయన మాటల్లో నిజం ఉందని కేజ్రీవాల్ అన్నారు. అవినీతిపరులందరినీ సీబీఐ, ఈడీ.. ఒకే పార్టీలోకి తీసుకొచ్చాయని ఎద్దేవా చేశారు. దేశంలోని చిల్లర దొంగలంతా బీజేపీలోనే ఉన్నారని విమర్శించారు. ప్రధానిగా మోడీనే ఎప్పటికీ ఉండరని అన్నారు. కాగా, ఆప్ కు వెంటనే జాతీయ పార్టీ హోదా ఇవ్వాలని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. జాతీయ పార్టీకి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయన్నారు. రివ్యూ పేరిట ఎలక్షన్​ కమిషన్​ జాప్యం చేయడం దారుణమన్నారు.