ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్‌ ఉన్నతస్థాయి సమావేశం

ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్‌ ఉన్నతస్థాయి సమావేశం

దేశ రాజధాని ఢిల్లీ వాసులను వాయు కాలుష్యం కమ్మేసింది. సిటీ అంతటా విషపూరితమైన పొగమంచు దట్టంగా కమ్మేయడంతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వరుసగా నాలుగో రోజూ వాయు నాణ్యత పడిపోయింది. సోమవారం (నవంబర్ 6) ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి (AQI) 437గా ఉందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (CPCB) ప్రకటించింది. అయితే గత మూడు రోజులతో పోల్చితే ఇది కాస్త తగ్గిందనే చెప్పాలి. 

కేజ్రీవాల్ సమీక్ష

వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం (నవంబర్ 6న)  ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌తోపాటు రవాణా శాఖ, ఢిల్లీ మున్సిపాలిటీ, పోలీస్‌, ఇతర శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన స్టేజ్‌-4 గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ అమలుపై చర్చించనున్నారు.

కేజ్రీవాల్‌ ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగిందనే విపక్షాల విమర్శలకు ఆప్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక కక్కర్‌ స్పందించారు. సీఏక్యూఎం ప్రకారం పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనాలు 50 నుంచి 67 శాతం తగ్గాయని చెప్పారు. పంజాబ్‌లో పంట కాల్చివేతలు జరుగుతున్న ప్రాంతాలు ఢిల్లీకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, కానీ.. హర్యానాలోని ప్రాంతాలు మాత్రం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని చెప్పారు.  పంజాబ్‌లోని తమ ప్రభుత్వం పంట వ్యర్థాల కాల్చివేతను విజయవంతంగా అరికడుతుండగా, హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం విఫలమైందని విమర్శించారు.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

ఢిల్లీలో ఆదివారం (నవంబర్ 5వ తేదీన) గాలి నాణ్యత మరింతగా దిగజారిపోయి సివియర్ ప్లస్ స్థాయికి పడిపోయింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మళ్లీ మొదటిస్థానంలోకి వచ్చింది. స్విట్జర్లాండ్ కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ రూపొందించిన తాజా లిస్ట్ లో టాప్ 10 పొల్యూటెడ్ సిటీల్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లోకి రాగా.. కోల్ కతా, ముంబై నగరాలు టాప్ 6లోకి చేరాయి. 

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) స్థాయిలను బట్టి ఆయా నగరాలతో ఐక్యూఎయిర్ సంస్థ తన వెబ్ సైట్ లో లిస్టును పొందుపరుస్తోంది. ఈ లిస్ట్ లో పేర్కొన్న ప్రకారం.. ఆదివారం (నవంబర్ 5న) ఉదయం 7.30 గంటల సమయానికి ఢిల్లీలో ఏక్యూఐ 483గా నమోదైంది. ఢిల్లీ తర్వాత పాకిస్తాన్ లోని లాహోర్ సిటీ రెండో స్థానంలో, కోల్ కతా మూడో స్థానంలో నిలిచాయి. బంగ్లాదేశ్ లోని ఢాకా, పాకిస్తాన్ లోని కరాచి నాలుగు, ఐదో స్థానాల్లో ఉండగా, ముంబై ఆరో స్థానంలో నిలిచింది. లాహోర్ లో 371, కోల్ కతాలో 206, ఢాకాలో 189, కరాచిలో 162, ముంబైలో 162 ఏక్యూఐ లెవల్స్ నమోదయ్యాయి. అయితే, ఆదివారం రాత్రి 7.35 గంటలకల్లా ఢిల్లీలో ఏక్యూఐ 427కు, లాహోర్ లో 218కి ఏక్యూఐ తగ్గినా మొదటి రెండు స్థానాల్లోనే నిలిచాయి. కోల్ కతాలో ఏక్యూఐ 172కు తగ్గడంతో మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరింది.  

స్కూళ్లకు 10 దాకా సెలవులు

ఢిల్లీలో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో స్కూళ్లకు సెలవులను నవంబర్ 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆతిషి ప్రకటించారు. ప్రైమరీ స్కూళ్లను పూర్తిగా బంద్ చేయాలని, 6 నుంచి 12వ క్లాస్ వరకు అవసరమైతే ఆన్ లైన్ లో మాత్రమే క్లాసులు చెప్పాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పొల్యూషన్ కారణంగా శుక్ర, శనివారాలు కూడా ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించగా, ఆదివారం మరో ఐదు రోజులు పొడిగించామన్నారు. గవర్నమెంట్, ప్రైవేట్ ఆఫీసుల్లో సగం మంది స్టాఫ్​పని చేసేలా చూసుకోవాలని, మిగతా సగం మంది వర్క్ ఫ్రం హోం చేసేలా చూడాలని పేర్కొన్నారు. 

ట్రక్కులు, కన్ స్ట్రక్షన్ పనులపై నిషేధం

పొల్యూషన్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) స్టేజ్–4 చర్యలను ప్రకటించింది. ఢిల్లీలోకి అత్యవసర సరుకులు, సర్వీసుల కోసం వినియోగించే ట్రక్కులు, ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులు తప్ప ఇతర ట్రక్కుల ఎంట్రీపై బ్యాన్ విధించింది. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన లైట్ కమర్షియల్ వెహికల్స్ ప్రవేశాన్నీ నిషేధించింది. అలాగే హైవేలు, రోడ్లు, పైప్ లైన్ల వంటి అన్ని నిర్మాణ రంగ పనులను ఆపేయాలని ఆదేశించింది. ఇక సిటీలో పొల్యూషన్ ఎక్కువున్న ప్రాంతాల్లో నీటిని స్ప్రే చేస్తున్నారు. ఇందుకోసం 12 ఫైర్ ఇంజన్లను వినియోగిస్తున్నారు.