ఢిల్లీలో తాగునీటి సమస్య.. వాటర్ వేస్ట్ చేస్తే 2 వేల ఫైన్

ఢిల్లీలో తాగునీటి సమస్య.. వాటర్ వేస్ట్ చేస్తే 2 వేల ఫైన్

నార్త్ లో తీవ్రమైన ఎండల ప్రభావంతో..అంతే తీవ్రంగా నీటి కరువు ఏర్పడుతోంది. పలు రాష్ట్రాల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఛత్తీస్ గఢ్ లోని మనేంద్ర గఢ్, చిర్మిరి, భరత్ పూర్ లో తీవ్ర కొరత ఏర్పడింది. తాగునీటి కోసం కిలో మీటర్ల దూరంలో ఉన్న వాగుల దగ్గరకు  కాలినడకన వెళ్తున్నారు జనం. వాగులు, వంకల్లో చెలిమెలు తవ్వి నీటిని సేకరించుకుంటున్నారు. ఇలా...చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది.

ఛత్తీస్ గఢ్ తో పాటు ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.   ప్రజలు తీవ్ర  ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే  రోజూ  అర ట్యాంకర్‌ రావడంతో ప్రజలకు నీళ్లు సరిపోవడం లేదు. ఎండ వేడిమికి కూడా ఇండ్లల్లో నీళ్లు రావడం లేదని  స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు,  ప్రజాప్రతినిధలు స్పందించి..తమ  తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ప్రజలు.

వాటర్ వేస్ట్ చేస్తే రూ.2 వేల ఫైన్

ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. దీంతో కారు కడిగినా, నీళ్లు వేస్ట్​ చేసినా రూ.2 వేలు ఫైన్​ వేస్తామని ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) బుధవారం ప్రకటించింది. పైప్​తో వెహికల్స్ వాష్ చేసినా, ఇంటి అవసరాలకు సరఫరా చేసే నీటిని నిర్మాణ, వాణిజ్య అవసరాలకు ఉపయోగించినా ఫైన్ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈమేరకు డీజేబీ అధికారులకు మంత్రి ఆతిశీ కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటి వృథాను అరికట్టేందుకు 200 టీమ్​లు నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. గురువారం ఉదయం 8 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. యమునా నది నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను హర్యానా గవర్నమెంట్ ఇవ్వట్లేదని, అందుకే నీటి ఎద్దడి ఏర్పడిందని మంత్రి ఆరోపించారు.