
న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు కాలుష్యంతో మొసమర్రక అల్లాడిన ఢిల్లీ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. కాలుష్యం కొంత మేర తగ్గి ఎయిర్ క్వాలిటీ మెరుగుపడుతుండటంతో నిర్మాణ రంగ పనులపై విధించిన బ్యాన్ ఎత్తేసినట్లు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గోపాల్‌రాయ్ సోమవారం ప్రకటించారు. బుధవారం జరిగే రివ్యూ మీటింగ్‌లో స్కూళ్లు, కాలేజీలు ఇతర విద్యాసంస్థల రీఓపెన్, ప్రభుత్వ సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోంపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఎయిర్ క్వాలిటీ మరింత మెరుగుపడితే నాన్ఎస్సెన్షియల్ గూడ్స్తరలించే సీఎన్జీ ట్రక్కులను కూడా ఢిల్లీలోకి అనుమతించడంపై ఆలోచిస్తామన్నారు. కాగా నాన్ ఎస్సెన్షియల్ గూడ్స్ తరలించే ట్రక్కులు ఢిల్లీలోకి రావడంపై విధించిన నిషేధాన్ని నవంబర్26 వరకు పొడిగించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ నెల 26 వరకు వర్క్ ఫ్రమ్ హోం విధించింది. ‘‘ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 600 మార్క్ కంటే ఎక్కువగానే ఉండేది. కాలుష్యాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యలతో క్వాలిటీ మెరుగుపడుతోంది. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నిర్మాణ, కూల్చివేత పనులపై బ్యాన్ ఎత్తివేయాలని మేము నిర్ణయించుకున్నాం. అయినప్పటికీ, కాలుష్య కట్టడి చర్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది’’ అని రాయ్ చెప్పారు. ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు 585 మానిటరింగ్ టీంలు పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే.. నోటీసు లేకుండా ఫైన్ వేస్తామని హెచ్చరించారు.