రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మరో 6 నెలల పాటు ఉచిత బియ్యం

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మరో 6 నెలల పాటు ఉచిత బియ్యం

ఢిల్లీ ప్రజలకు శుభవార్త చెప్పారు... సీఎం అరవింద్ కేజ్రీవాల్. కోవిడ్ కారణంగా గత ఏడాది నుంచి పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ఉచిత రేషన్ స్కీంను మరో ఆరు నెలల పాటు అంటే మే 2022 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

 ధరలు విపరీతంగా పెరిగాయి.  సామాన్యుడు రెండు పూటల కడుపు నిండా తినేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇక కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. ప్రధాన మంత్రి గారు దయచేసి మీరు పేదల కోసం మరో ఆరునెలల పాటు ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని పొడిగించండి. ఢిల్లీ ప్రభుత్వం పేదల కోసం ఉచిత బియ్యం పథకాన్ని మరో ఆరు నెలల పాడు పొడిగిస్తోంది’ అంటూ అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ఈనెల 30తో ముగుస్తోంది. అయితే ఈ పథకాన్ని కొనసాగించే ప్రతిపాదన లేదని  ఫుడ్ సెక్రటరీ సుధన్షు పాండే ప్రకటించిన తర్వాత .. కేజ్రీవాల్ ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 
కరోనా కారణంగా కేంద్రంతో పాటు రాష్ట్రాలన్నీ కూడా పేద ప్రజలకు ఉచిత బియ్యాన్ని అందించాయి. జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA), 2013,  ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీం కిందనే ఢిల్లీ కేజ్రీవాల్ సర్కార్ లబ్దిదారులకు ఉచిత రేషన్‌ను అందిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్‌ను ఢిల్లీ వ్యాప్తంగా 17.77 లక్షల లబ్ది దారులకు చేరుతోంది. నగర వ్యాప్తంగా దాదాపుగా 2వేలకు పైగా రేషన్ దుకాణాల ద్వారా ఈ పథకాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఉచిత బియ్యం పథకం కింద 72. 78 లక్షలమంది లబ్ది పొందుతున్నారు.