చిక్కుల్లో పేటీఎం పోస్ట్ పెయిడ్

చిక్కుల్లో పేటీఎం పోస్ట్ పెయిడ్

న్యూఢిల్లీ : పేటీఎం పోస్ట్ పెయిడ్ వాలెట్ ఆపరేషన్స్‌‌ చట్టవిరుద్ధమని, అనధికారమని నమోదైన ఫిర్యాదుపై స్పందించాలని రిజర్వు బ్యాంక్‌‌ ఆఫ్ ఇండియాను (ఆర్​బీఐ) ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్ నేతృత్వంలోని డివిజెన్ బెంచ్ ఈ ఆదేశాలను జారీ చేసింది.  పేటీఎం పోస్ట్ పెయిడ్ వాలెట్‌‌ కార్యకలాపాలు చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ.. ఆర్థికవేత్త అభిజిత్ మిశ్రా, న్యాయవాది పాయల్ బహల్‌‌ ద్వారా పిల్ దాఖలు చేశారు. పేమెంట్ బ్యాంకులకు ఆర్‌‌బీఐ లెసెన్సులు ఇస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఈ వాలెట్లు క్రెడిట్, లెండింగ్ యాక్టివిటీ చేయకూడదని పిల్‌‌లో పేర్కొన్నారు.  పోస్ట్ పెయిడ్ వాలెట్ కార్యకలాపాల గురించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌.. బ్యాంకింగ్ రెగ్యులేటరీకి తెలుపలేదని పిల్‌‌లో ఆరోపించారు. పేటీఎం పేమెంట్స్‌‌ బ్యాంక్‌‌ కస్టమర్ల సమాచారాన్ని థర్డ్ పార్టీకి (సిటీ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్)కు ఇస్తోందని  కూడా ఆరోపించింది. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని పిల్‌‌ పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేటరీ యాక్ట్ కింద పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌ లిమిటెడ్‌‌పై తగిన చర్యలు తీసుకునేలా ఆర్‌‌‌‌బీఐను ఆదేశించాలని ఢిల్లీ హైకోర్ట్‌‌లో ఈ పిల్ దాఖలు చేశారు.