ఫేస్‌బుక్ ఖాతా కావాలా? ఆర్మీ ఉద్యోగం కావాలా?

ఫేస్‌బుక్ ఖాతా కావాలా? ఆర్మీ ఉద్యోగం కావాలా?

ఆర్మీలో కొనసాగాలంటే ఫేస్‌బుక్ ఖాతా తప్పనిసరిగా తొలగించాలని ఓ కల్నల్ ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. చైనాతో గొడవల నేపథ్యంలో చైనాకు సంబంధించిన యాప్ లన్నీ భారత సైనికులు తొలగించాలని ఇండియన్ ఆర్మీ ఆదేశించింది. భారత ఆర్మీలో పనిచేసే సిబ్బంది అందరూ తమ సోషల్ మీడియా ఖాతాలైన ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ లతో పాటు మరో 87 ఇతర యాప్ లను తొలగించాలని జూన్ 6న ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్న పీకే. చౌదరీ మాత్రం.. తన ఫేస్‌బుక్ ఖాతాను తొలగించకుండా అలాగే వాడుతున్నాడు. ఆర్మీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించాడు. ఫేస్‌బుక్ ఖాతా తొలగించకుండా తనకు ఉపశమనం కల్పించాలని కోర్టును కోరాడు. తనకు చెందిని స్నేహితులు, బంధువులు మరియు తన కూతురు బయట దేశాలలో ఉన్నందున.. వారితో మాట్లాడటానికి తనకు ఈ యాప్ తప్పనిసరని ఆయన తన అభ్యర్థనలో పేర్కొన్నాడు. అయితే కోర్టు మాత్రం ఆయనకు తాత్కాలిక ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. దేశ భద్రత దృష్ట్యా ఆర్మీ సిబ్బంది సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ల వాడకాన్ని రద్దు చేసుకోవాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించినందున.. మీరు కూడా ఫేస్‌బుక్ ఖాతాను తొలగించాలని హైకోర్టు చౌదరీని కోరింది.

అంతేకాకుండా.. మీకు ఫేస్‌బుక్ వాడకం తప్పనిసరి అయితే మీరు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ పేపర్ మీద రాసివ్వాలని రాజీవ్ సహాయ్ ఎండ్లా మరియు ఆశా మీనన్లతో కూడిన ధర్మాసనం ఆయనను కోరింది. అలా రాసి ఇస్తే మీరు ఫేస్‌బుక్ ఖాతా కావాలో లేక ఆర్మీలో ఉద్యోగం కావాలో కూడా తేల్చుకోవాల్సి వస్తుందని ధర్మాసనం ఆయనకు సూచించింది. ఆర్మీ ఉద్యోగం వద్దనుకుంటే మీరు ఎప్పుడైనా సోషల్ మీడియా ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది.

ఈ విషయంపై అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్జి) చేతన్ శర్మ మాట్లాడుతూ.. ‘ఫేస్‌బుక్ ఒక బగ్ అని మేం అనుకుంటున్నాం. దీని ద్వారా శత్రుదేశాలు మన సైనికులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అంతేకాకుండా సైబర్ అటాక్ కు కూడా దిగుతున్నాయి. ఇలా చాలాసార్లు జరిగింది.
వాట్సాప్, ట్విట్టర్ మరియు స్కైప్ వంటి ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పుడు.. పీకే. చౌదరీ ఫేస్‌బుక్ మాత్రమే ఎందుకు వాడాలనుకుంటున్నారో తెలియదు’ అని ఆయన అన్నారు.

భారత సైన్యంలోని సభ్యులందరూ తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగించాలని ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌ను పిటిషనర్ కోరాడు. సాయుధ దళాల సిబ్బంది యొక్క ప్రాథమిక హక్కులు చట్టబద్ధమైన ఆదేశం ద్వారా మరియు ఏకపక్ష నిర్ణయం ద్వారా మార్చలేరని పిటిషనర్ తన పిటిషన్ లో తెలిపాడు. అందుకే జూన్ 6న తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పిటిషనర్ రక్షణ మంత్రిత్వ శాఖను కోరాడు. ఆర్మీ తీసుకున్న ఈ నిర్ణయం.. చట్ట నిబంధనలను కించపరచడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నాడు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ, జీవన హక్కు మరియు గోప్యత హక్కుతో సహా సైనికుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషనర్ ఆరోపించారు. ఆర్మీ సిబ్బంది యొక్క ప్రాథమిక హక్కులను సవరించడానికి మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌కు రాజ్యాంగం లేదా మరే ఇతర చట్టం ప్రకారం అధికారం లేదని ప్రకటించాలని కూడా పిటిషనర్ కోరాడు. కేంద్ర ప్రభుత్వం, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ తో పాటు భారత సైన్యం యొక్క అత్యున్నత సైనిక అధికారి అయిన ఆర్మీ స్టాఫ్ యొక్క చీఫ్ ను కూడా పిటిషనర్ తన పిటీషన్ లో భాగస్వాములను చేశాడు.

ఇవన్నీ పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. ఆర్మీ తీసుకున్న పాలసీ పత్రాన్ని పరిశీలించడానికి సీల్డ్ కవర్‌లో పంపాలని ఎఎస్‌జిని కోరింది. తదుపరి విచారణను జూలై 21 కి వాయిదా వేసింది.

For More News..

వీడియో: ఆవును విడిచి ఉండలేని ఎద్దు.. ఆవుతో పాటు..

వీసాల రద్దు విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్

మూడు బల్బులు, ఒక్క టీవీ.. కరెంటు బిల్లు రూ. 1.66 లక్షలు