- పిటిషన్ పై సమాధానం కోరుతూ ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు: తన వ్యక్తిగత హక్కులు, గోప్యతను రక్షించాలని కోరుతూ సినీ నటుడు అక్కినేని నాగ చైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని పిటిషన్ వేయగా.. జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నాగచైతన్య తరఫున సీనియర్ అడ్వకేట్ వైభవ్ గగ్గర్ వాదనలు వినిపించారు. నాగ చైతన్య అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వ్యక్తిత్వాన్ని పోర్నోగ్రాఫిక్ వెబ్‌సైట్లు, వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు దుర్వినియోగం చేస్తున్నాయని తెలిపారు. కొన్ని వెబ్ సైట్లు ఆయన పేరును అసభ్య పదాలతో కలిపి సెర్చ్ ఫలితాల్లో చూపించి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయని అన్నారు.
అలాగే, నటుడి పేరు, పోలికతో అనధికారికంగా ముద్రించిన టీ-షర్టులు, ఇతర వస్తువులను విక్రయిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. నటుడి వ్యక్తిగత హక్కులకు(పర్సనాలిటీ రైట్స్) భంగం కలిగించడాన్ని తప్పుబట్టింది. ఆయన వ్యక్తిత్వ హక్కులను కాపాడేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా నాగ చైతన్య పేరు, ఫొటోలు, కంఠస్వరం వాణిజ్యపరంగా వాడటంపై నిషేధం విధించింది. నాగచైతన్య పిటిషన్ పై సమాధానం కోరుతూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.
