రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు

రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు
  • కరోనిల్ ట్యాబ్లెట్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దావా వేసిన డీఎంఏ 
  • విచారణ జులై 13కు వాయిదా
  • విచారణ ముగిసే వరకు ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని ఆదేశం

న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్‌ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అల్లోపతి వైద్యులను కించపరిచేలా రాందేవ్ వ్యాఖ్యలు చేశారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో అల్లోపతి వైద్యం విఫలమైందని విమర్శలు గుప్పించడంతో దేశంలోనే కాదు ప్రపంచ వ్యప్తంగా కలకలం రేపింది. అంతే కాదు తన సంస్థ పతంజలి తయారు చేస్తున్న కరోనిల్ ట్యాబ్లెట్లపై చేస్తున్న ప్రచారంపై ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనిల్ ట్యాబ్లెట్లపై ఆయన చేస్తున్న ప్రచారం.. పరీక్షలకు ఇస్తున్న సమాచారం అంతా భోగస్ అని ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. అంతేకాదు రాందేవ్ బాబాకు దీటుగా బదులిచ్చేందుకు పూనుకోగా ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ ఒకడుగు ముందుకేసి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
డీఎంఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు తీర్పు విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాదు తదుపరి విచారణ సమయం వరకు ఆయన ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. కొరోనిల్ టాబ్లెట్‌పై రామ్‌దేవ్‌బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి సమాచారం వ్యాప్తి చేయకుండా రామ్‌దేవ్‌ బాబాను ఆపాలంటూ కోర్టులో దావా వేసింది. ఈ నేపధ్యంలో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు రామ్‌దేవ్‌కు సమన్లు జారీ చేసింది. 
ముజఫర్ పూర్ కోర్టులో రాందేవ్ బాబాకు వ్యతిరేకంగా పిటిషన్
రాందేవ్ బాబాపై అల్లోపతి వైద్యులు కన్నెర్ర చేస్తున్నారు. ఏకంగా దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానం తలుపుతట్టారు. యోగా పేరుతో డబ్బులు సంపాదించుకుంటున్న నీకు వైద్యం గురించి ఏం తెలుసంటూ ఆగ్రహంతో మండిపడుతున్న నేపధ్యంలో బీహార్ కు చెందిన జ్ఘాన్ ప్రకాశ్ అనే వ్యక్తి రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలంటూ ముజఫర్ పూర్ జ్యుడీషియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరాడు. విపత్తుల చట్టం కింద తీవ్రాతి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు.