విమానం టికెట్ ధరలు అలా పెరుగుతుంటే మీరేం చేస్తున్నారు.. 5 వేలు.. ఆరు వేల రూపాయలు ఉండాల్సిన విమానం టికెట్ ధర.. రాత్రికి రాత్రి 30 వేలు.. 40 వేల రూపాయలు అవుతుంటే మీరేం చేస్తున్నారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు. ఇండిగో ఎయిర్ లైన్స్ వ్యవహారంపై దాఖలైన పిటీషన్లపై.. 2025, డిసెంబర్ 10వ తేదీన విచారించిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న గందరగోళం.. చిక్కుకుపోయిన ప్రయాణికులకు సాయం చేసే విషయంలో ఎలాంటి తక్షణ చర్యలు తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది ఢిల్లీ హైకోర్టు. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.. ఇంత దూరం వచ్చే వరకు మీరేం చేస్తున్నారంటూ ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు.
సంక్షోభం తలెత్తినప్పుడు మిగతా ఎయిర్ లైన్స్ వ్యవహరించే తీరు ఇదేనా.. సంక్షోభం సమయంలో ఇతర ఎయిర్ లైన్స్ సంస్థలు ఎలా ప్రయోజనం పొందుతాయో అర్థం కావటం లేదు.. టికెట్ ధరలను 30 వేలు.. 40 వేల రూపాయలకు పెంచేశారు.. అది ఎలా జరుగుతుంది.. టికెట్ ధరల నిర్ణయంపై మార్గదర్శకాలు లేవా.. గైడ్ లైన్స్ ఉండవా అంటూ జస్టిస్ గెడెలా ప్రశ్నించినట్లు సోషల్ ప్లాట్ ఫాం లైవ్ లా రాసుకొచ్చింది.
జస్టిస్ వ్యాఖ్యలపై ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వివరణ ఇస్తూ.. టికెట్ ధరలు పెంచిన ఎయిర్ లైన్స్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లాయని.. వాటికి స్పందించిన కంపెనీలు క్షమాపణలు చెప్పాయంటూ కోర్టుకు వివరించారాయన.
ఇండిగో విమానాలు రద్దయిన తర్వాత ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించటంలో.. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు.. పరిస్థితి ఇంత దూరం రావటానికి ప్రభుత్వం బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు.

