
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన కన్హయ్య లాల్ హత్య కేసు ఆధారంగా తెరకెక్కిన ‘ఉదయపూర్ ఫైల్స్’ సినిమా విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. సినిమా ప్రదర్శనపై నిషేధం విధిస్తూ గురువారం (జూలై 10) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మంజూరు చేసిన సర్టిఫికెట్‌కు వ్యతిరేకంగా రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
పిటిషనర్ సమర్పించిన దరఖాస్తుపై సినిమాటోగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని.. అప్పటి వరకు ఉదయపూర్ ఫైల్స్ సినిమా విడుదలపై స్టే కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో సినిమా విడుదలకు ఒక్కరోజు (జూలై 11) ముందు రిలీజ్ ఆగిపోయింది.
కాగా, 2022, జూన్ 28న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కన్హయ్యలాల్ అనే టైలర్‌ను ఇద్దరు ఇస్లామిక్ ఛాందసవాదులు దారుణంగా హత్య చేశారు. కస్టమర్లుగా వచ్చిన దుండగులు కన్హయ్య లాల్‌ను ఛాతీ పొడవడంతో పాటు తల నరికేశారు. ఈ దారుణాన్ని వీడియో తీసి ఆన్ లైన్లో విడుదల చేశారు దుండగులు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నయ్య లాల్ హత్యకు వ్యతిరేకంగా రాజస్థాన్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి.
దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన కన్నయ్య లాల్ హత్య కేసు ఆధారంగా భరత్ ఎస్. శ్రీనెత్, జయంత్ సిన్హా సంయుక్తంగా ఉదయ్‌పూర్ ఫైల్స్ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు విజయ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించాడు. 2025, జూలై 11న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఉదయ్‌పూర్ ఫైల్స్ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన జమాతే ఇ ఇస్లామి.. మూవీ విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
ఈ సినిమా విడుదలైతే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జమియత్ ఉలేమా-ఇ-హింద్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఉదయపూర్ ఫైల్స్ సినిమాలో ఒక వర్గాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని.. మూవీ విడుదలపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం (జూలై 10) విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. జమియత్ ఉలేమా-ఇ-హింద్ వాదనలతో ఏకీభవించి ఉదయ్ పూర్ ఫైల్స్ సినిమా విడుదలపై స్టే విధించింది.