జనాభా నియంత్రణపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

జనాభా నియంత్రణపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. జనాభా పెరుగుదల కారణంగా నిరుద్యోగం, క్రైం రేటు పెరుగుతోందని పిటిషనర్‌ అందులో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన బెంచ్‌ బుధవారం దీనిపై వాదనలు వినేందుకు అంగీకరించింది. బీజేపీ లీడర్‌, లాయర్‌ అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ ఈ పిటిషన్‌ వేశారు.

జనాభా నియంత్రణపై నేషనల్‌ కమిషన్‌ టు రివ్యూ ద వర్కింగ్‌ ఆఫ్‌ ద కాన్‌స్టిట్యూషన్‌ (ఎన్‌సీఆర్‌డబ్ల్యూసీ) చేసిన సిఫారసులను అమలు చేయాలని పిటిషనర్‌ కోరారు. ఎన్‌సీఆర్‌డబ్ల్యూసీ రెండేళ్లపాటు విస్తృతంగా చర్చలు జరిపి రాజ్యాంగంలోని ‘47ఏ’ను సవరించాలని నివేదిక ఇచ్చిందన్నారు. ‘ఇప్పటివరకు రాజ్యాంగాన్ని 125 సార్లు సవరించారు.

వందల చట్టాలు తెచ్చారు. జనాభా నియంత్రణపై రాజ్యాంగంలో మార్పులు చేసుకుంటే దేశంలోని 50శాతం సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు, ఆస్తిపై హక్కుకు, వివిధ సబ్సిడీలకు, ఓటు వినియోగానికి, ఎన్నికల్లో పోటీకి కేవలం ఇద్దరు, అంతకంటే తక్కువ మంది పిల్లలుంటేనే అర్హులనే నిబంధన పెట్టాలని ఆయన కోరారు.