ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ మార్కెట్‌కి వెళ్లినవాళ్లకు ఒక విషయం బాగా తెలుసు. అక్కడ కొనుగోలు చేయడం ఎంత ఆనందమో, చేతుల్లో భారీ సంచులు మోసుకుంటూ జనాల్లో తిరగడం అంత కష్టం. రెండు మూడు దుకాణాలు తిరిగేసరికి చేతులు నొప్పెడతాయి. పిల్లలతో వచ్చిన కుటుంబాలు, వృద్ధులు, మహిళలు అయితే మరింత అలసిపోతారు. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అక్కడ కొత్త సౌకర్యం ప్రారంభమైంది.
ఇకపై మార్కెట్లో సంచులు మోసుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు. డబ్బులు చెల్లిస్తే ప్రత్యేక సహాయకుడు వెంట వచ్చి కొనుగోలు చేసిన సంచులు మోస్తాడు. మనం ప్రశాంతంగా దుకాణాలు చూస్తూ తిరగొచ్చు. అవసరమైతే దారి చూపిస్తాడు. తినుబండారాల దగ్గర వరుసలో నిలబడతాడు. మెట్రో స్టేషన్ లేదా వాహనం నిలిపిన చోటువరకు సామాను మోసుకెళ్తాడు. ఎక్కువసేపు తిరిగి అలసిపోతే కూర్చోవడానికి మడత కుర్చీ కూడా ఏర్పాటుచేస్తాడు. ఈ సేవ ఇప్పుడు అక్కడికి వచ్చే ప్రజల్లో పెద్ద చర్చగా మారింది.
“కొనుగోలు చేయడం ఇష్టం... కానీ సంచులు మోసుకోవడం ఇష్టం లేదు” అని చాలామంది సరదాగా చెప్తుంటారు. అలాంటి వాళ్లకి ఈ సౌకర్యం ఎంతో ఉపశమనంగా మారుతోంది. చేతులు ఖాళీగా ఉంటే దుకాణాలు సౌకర్యంగా చూడొచ్చు. పిల్లల్ని చూసుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఇక్కడితో ఆగకుండా మరికొన్ని సదుపాయాలు కూడా అందిస్తున్నారు. వర్షం పడితే గొడుగులు ఇస్తారు. మొబైల్ బ్యాటరీ అయిపోతే చార్జింగ్ సదుపాయం కల్పిస్తారు. అవసరమైతే పవర్ బ్యాంక్ కూడా ఇస్తారు. చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ఇప్పటివరకు మార్కెట్‌కి వెళ్లడం అంటే అలసటగా భావించిన చాలామందికి ఇప్పుడు కొత్త అనుభవం ఎదురవుతోంది. ప్రస్తుతం ఈ సేవ లజ్‌పత్ నగర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే త్వరలోనే మరిన్ని పెద్ద మార్కెట్లలో కూడా ఈ సౌకర్యం కనిపించే అవకాశం ఉంది.
