
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ(Delhi liquor policy case) నోటీసులివ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) స్పందించిన తీరును బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తలవంచదంటూ స్పందించటాన్ని తప్పుబడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత ఒక్కరే కాదంటున్నారు. బీజేపీ నేతలు ఎవరెవరు ఏ విధంగా స్పందించారో చూద్దాం..
కవిత వల్ల తెలంగాణ తలవంచింది: అర్వింద్
కవిత వ్యాఖ్యలకు బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎప్పుడూ ఎవరికీ తలవంచలేదు కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో( Delhi Liquor Scam)లో మీ ప్రమేయం ఉందని ఈడీ చెప్పడంతో దేశం ముందు సిగ్గుతో తలవంచుతోందని విమర్శించారు. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళ కూడా లేదన్నారు. దీనికి కవిత ఆధిపత్య ధోరణే కారణమన్నారు. 2019 ఎన్నికల్లో కవిత ఓడిపోయిన తర్వాత నెపోటిజం కోటాలో ఎమ్మెల్సీ అయిన కవిత లిక్కర్ స్కాంలో కీలక కుట్రదారుగా ఉన్నారన్నారని ఆరోపించారు. లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కవిత జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారని విమర్శించారు.
ఈడీ నోటీసులిస్తే తప్పేంటి: కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు (kishan reddy). లిక్కర్ దందా చేసింది మీరు.. అక్రమంగా కోట్లు సంపాదించింది మీరు.. దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీలపై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారాయన. (delhi liquor scam)ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటీ అని నిలదీశారాయన. తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి. చేసిన తప్పులు అన్నీ చేసి.. మీ తప్పులపై నోటీసులు ఇస్తే.. తెలంగాణ సమాజానికి ముడిపెట్టి.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.
బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది: డీకే అరుణ
లిక్కర్ స్కాంలో కవితతోపాటు అందరికీ నోటీసులు ఇచ్చారని.. ఆమెకు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదన్నారు బీజేపీ మహిళా నేత డీకే అరుణ. దీన్ని కక్ష సాధింపుగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని.. తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత ఒక్కరే కాదని.. తెలంగాణ సమాజం అని వ్యాఖ్యానించారు డీకే అరుణ. మహిళలపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని.. ఈడీ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారామె.