60 రోజుల్లో చార్జిషీట్ .. కవిత అరెస్టు చట్టబద్ధమే : ఈడీ

60 రోజుల్లో చార్జిషీట్ ..  కవిత అరెస్టు చట్టబద్ధమే : ఈడీ

ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని, పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం ఆమెను అరెస్టు చేశామని ఈడీ తరఫు న్యాయవాది జోయెబ్ హుస్సేన్ చెప్పారు. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. కవిత అరెస్టుపై 60 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్షాలను తారుమారు చేస్తారని అన్నారు. అందుకే ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు పురోగతికి సంబంధించిన నివేదికను కోర్టుకు అందజేశారు. 

కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ కోర్టులో తను దాఖలు చేసిన పిటిషన్ ను కవిత వాపస్ తీసుకున్నారని చెప్పారు. మార్చి 15న సాయంత్రం 5.20 గంటలకు కవితను హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో అరెస్టు చేశామని, ఇందుకు కారణాలను తెలుపుతూ ఉన్న స్టేట్ మెంట్ పై ఆమె సంతకం కూడా తీసుకున్నామని వివరించారు. ఆ రోజు సూర్యాస్తమయం సమయం 6.26 గంటలని తెలిపారు.  కవితను 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టామని అన్నారు.  తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కవిత వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు లో మార్చి 19న ఉపసంహరించుకున్నారని చెప్పారు. 

అంటే అరెస్టు చట్టవిరుద్ధంగా జరగలేదని ఆమెనే ఒప్పుకొన్నట్టు అని జోయెబ్ కోర్టుకు విన్నవించారు. ఇండో స్పిరిట్ కంపెనీలో కవితకు అరుణ్ పిళ్లై బినామీగా ఉన్నారన్నారు. సౌత్ గ్రూపులోని ఇతర వ్యక్తులకు  ప్రేమ్ మండూరి బినామిగా ఉన్నారని చెప్పారు. కవితకు వ్యతిరేకంగా శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, బుచ్చిబాబు వాంగ్మూలాలు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసుకున్న న్యాయ స్థానం మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పు వెలువరించింది.