లిక్కర్​ స్కామ్​లో సిసోడియాకు సీబీఐ ప్రశ్నలు

లిక్కర్​ స్కామ్​లో సిసోడియాకు సీబీఐ ప్రశ్నలు
  • కీలకంగా మారిన అభిషేక్​రావు స్టేట్​మెంట్
  • సీబీఐ ముందుకు సిసోడియా, పిళ్లై, హైదరాబాద్​ ఫార్మా కంపెనీ ఎండీ, ఏపీ ఎంపీ కొడుకు
  • చార్టర్డ్​​ అకౌంటెంట్​ గోరంట్లకు నోటీసులు!

హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ప్రధాన నిందితులైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్​ సిసోడియా, రాబిన్ డిస్టిలరీస్‌‌ డైరెక్టర్‌‌‌‌ అరుణ్ రామచంద్ర పిళ్లైతోపాటు ఏపీకి చెందిన ఎంపీ కుమారుడు (లిక్కర్​ వ్యాపారి), హైదరాబాద్‌‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఎండీ సోమవారం ఢిల్లీలో సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. డీఎస్పీ అలోక్‌‌ కుమార్ షాహీ ఆధ్వర్యంలోని స్పెషల్‌‌ టీమ్స్‌‌ వీరిని సుదీర్ఘంగా విచారించాయి. ఆగస్టు 17న లిక్కర్ పాలసీ స్కామ్‌‌ కేసు రిజిస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ  కేసులో ఇప్పటికే ఢిల్లీకి చెందిన ఇండోస్పిరిట్‌‌ కంపెనీ ఎండీ సమీర్‌‌‌‌ మహేంద్రు, ముంబైకి చెందిన ఓన్లీ మచ్‌‌ లౌడర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ సీఈవో విజయ్‌‌నాయర్‌‌, హైదరాబాద్​కు చెందిన రాబిన్ డిస్టిలరీస్‌‌  డైరెక్టర్‌‌‌‌ బోయినపల్లి అభిషేక్‌‌రావు అరెస్ట్ అయ్యారు. ఈ ముగ్గురి స్టేట్​మెంట్ల ఆధారంగా సిసోడియా, పిళ్లై, ఎంపీ కుమారుడు, ఫార్మా కంపెనీ ఎండీని సోమవారం సీబీఐ ప్రశ్నించింది. ప్రధానంగా రూ. 30 కోట్ల లంచం డబ్బు వివరాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఏడాది కాలంగా మనీష్​ ​ సిసోడియాను కలిసిన తెలంగాణ రాజకీయ ప్రముఖులు, లిక్కర్ వ్యాపారుల గురించి సీబీఐ అధికారులు వివరాలు రాబట్టినట్లు సమాచారం. సిసోడియా స్టేట్‌‌మెంట్​తో ఈ స్కామ్‌‌లో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలున్న తెలంగాణ లీడర్లు, వ్యాపారులను త్వరలో విచారించే అవకాశాలు ఉన్నాయి.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్​ సిసోడియాతో పాటు ఒక్కొక్కరిని సీబీఐ అధికారులు విడివిడిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్‌‌ పాలసీలకు సంబంధించిన వివరాలతో సిసోడియాను విచారించినట్లు తెలిసింది. పాలసీ ప్రపోజల్స్‌‌కు ముందు హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తుల గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఎక్సైజ్ కమిషనర్ అర్వ గోపికృష్ణ, డిప్యూటీ కమిషనర్‌‌ ఆనంద్‌‌ తివారీ ఆధ్వర్యంలో రూపొందించిన గత  పాలసీలు, 2021–22 కోసం తయారు చేసిన కొత్త పాలసీ మధ్య గల వ్యత్యాసాన్ని సీబీఐ గుర్తించింది. కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి, లిక్కర్ కంపెనీలకు వచ్చే ఆదాయంపై సిసోడియాను ప్రశ్నించి స్టేట్​మెంట్​ రికార్డు చేసినట్లు  తెలిసింది. బోయినపల్లి అభిషేక్‌‌రావు ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌ ఆధారంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌‌లో జరిగిన మీటింగ్స్‌‌పైనా ఆరా తీసినట్లు సమాచారం. 

వ్యాపార, రాజకీయ లింకులు

లిక్కర్​ స్కామ్‌‌లో రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలకు, వ్యాపారులకు ఉన్న లింకులపై సీబీఐ అధికారులు కీలక ఆధారాలు రాబడుతున్నారు. ఇప్పటికే సేకరించిన ఆధారాలతో హైదరాబాద్​కు చెందిన బోయినపల్లి అభిషేక్‌‌రావును అరెస్ట్‌‌ చేశారు. ఐదురోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో రామచంద్ర పిళ్లై, అభిషేక్‌‌రావు మధ్య వ్యాపార, ఆర్థికలావాదేవీల వివరాలు రాబట్టారు. సోమవారం విచారణకు హాజరైన రామచంద్ర పిళ్లైని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. సమీర్ మహేంద్రు, విజయ్‌‌నాయర్‌‌‌‌తో పిళ్లై జరిపిన ట్రాన్సాక్షన్ల గురించి ఆరా తీసినట్లు సమాచారం. కస్టడీలో అభిషేక్‌‌రావు ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌ ఆధారంగా పిళ్లైని క్రాస్‌‌ ఎగ్జామిన్​ చేసినట్లు తెలిసింది. నాలుగు అనుమానిత అకౌంట్లను గుర్తించినట్లు సమాచారం. 

క్విడ్​ ప్రో కో

లిక్కర్ మీటింగ్స్ డేటా ఆధారంగా ఏపీకి చెందిన ఎంపీ కుమారుడి(లిక్కర్​ వ్యాపారి)ని సీబీఐ విచారించింది. ఇతడి కంపెనీల నుంచి దేశవ్యాప్తంగా తీసుకున్న టెండర్ల వివరాలను రికార్డ్‌‌ చేసినట్లు తెలిసింది. ఢిల్లీ ఎక్సైజ్‌‌ పాలసీ విషయంలో కమిషనర్‌‌‌‌ అర్వ గోపీకృష్ణతో ఎంపీ కొడుకుకు సంబంధాలున్నాయా అనే కోణంలోనూ ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ప్రముఖ ఫార్మా ఎండీ కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్‌‌ డీలింగ్ టైంలో ఆయన కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్ట్‌‌లు వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలోని 42 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్‌‌ కాస్ట్​ను ఫార్మా కంపెనీ ఎండీ వేలంలో దక్కించుకున్నట్లు భావిస్తున్నది. ఇందులో క్విడ్ ప్రో కో జరిగిందనే  కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.త

నేడు సీబీఐ ముందుకు సీఏ గోరంట్ల బుచ్చిబాబు

చార్టర్డ్​ అకౌంటెంట్‌‌ గోరంట్ల బుచ్చిబాబుకు సీబీఐ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. మంగళవారం ఢిల్లీలోని సీబీఐ హెడ్‌‌ క్వార్టర్స్‌‌లో హాజరుకావాలని ఆదేశించినట్లు సమాచారం. గోరంట్ల అండ్ ఆసోసియేట్స్ పేరుతో దోమలగూడలో ఆఫీస్ నిర్వహిస్తున్నారు. రాబిన్ డిస్టిలరీస్‌‌తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలకు గోరంట్ల బుచ్చిబాబు సీఏగా పనిచేస్తున్నారు. ఓ నాయకురాలికి చెందిన పలు కంపెనీలకు గోరంట్ల అసోసియేట్స్‌‌ సంస్థ ఆడిట్స్‌‌ నిర్వహించేది. లిక్కర్ స్కామ్‌‌లో సేకరించిన డాక్యుమెంట్స్‌‌ ఆధారంగా గత నెల 16,17వ తేదీల్లో సీబీఐ,ఈడీ అధికారులు హైదరాబాద్‌‌, ఏపీలో సోదాలు చేశారు. హైదరాబాద్‌‌ దోమలగూడలోని హెడ్‌‌ ఆఫీస్‌‌ నుంచి కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.సంబంధిత సిబ్బంది స్టేట్‌‌మెంట్స్ రికార్డ్‌‌ చేశారు.