బీఆర్ఎస్​ ముఖ్య నేతల్లో దడ పుట్టిస్తున్నఢిల్లీ లిక్కర్​స్కామ్

బీఆర్ఎస్​ ముఖ్య నేతల్లో దడ పుట్టిస్తున్నఢిల్లీ లిక్కర్​స్కామ్

లిక్కర్​ స్కామ్​లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత
ఇప్పటికే ఆమె సన్నిహితుల అరెస్ట్​
త్వరలో ఎలాంటి పరిణామాలైనా జరగొచ్చంటున్న గులాబీ  లీడర్లు

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్​స్కామ్​లో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్​సిసోడియా అరెస్ట్​ కావడం బీఆర్ఎస్​ ముఖ్య నేతల్లో దడ పుట్టిస్తున్నది. కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచడంతో నెక్స్ట్​​ఏం జరుగుతుందా అని ఆందోళన చెందుతున్నారు. స్కామ్​కు కేంద్ర బిందువుగా చెప్తున్న సౌత్​లాబీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు మాగుంట రాఘవ నడిపించారని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నది. ఈ స్కామ్​లో ఇప్పటివరకు 12 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్​చేయగా.. ఇందులో కవిత సన్నిహితులైన బోయినపల్లి అభిషేక్, అరుణ్​ రామచంద్ర పిళ్లై, శరత్​చంద్రారెడ్డి ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్​ బుచ్చిబాబును కూడా సీబీఐ అరెస్టు చేసింది. సిసోడియా అరెస్ట్ తర్వాత ఇంకెవరు అరెస్ట్ అవుతారనే దానిపై ప్రగతి భవన్​ వర్గాల్లో, బీఆర్ఎస్​ పార్టీలో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. గతంలో ఎమ్మెల్సీ కవితను ఈ స్కామ్​లో సాక్షిగా సీబీఐ విచారించింది. కేసులో నిందితులుగా పేర్కొంటున్న వారి రిమాండ్​రిపోర్టులు, దాఖలు చేసిన చార్జ్​షీట్లలో కవిత పేరు ప్రస్తావించారు. స్కామ్​ టైమ్​లో కవిత పలు ఐఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తన చార్జ్​షీట్​లో వెల్లడించింది. ఆప్​నేత విజయ్ ​నాయర్​ ద్వారానే సౌత్​లాబీ సిసోడియాకు వంద కోట్ల ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి.

కీలక రాజకీయ నేత అరెస్ట్​తో..

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో మొదట వ్యాపారవేత్తలు, ఆడిటర్లను అరెస్టు చేశారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియాను సీబీఐ అరెస్ట్​ చేయడం, ఆయన కీలక నేత కావడంతో ఇక ముందు అరెస్టులన్నీ రాజకీయ నేతలవే ఉండొచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ స్కామ్​లో మరికొన్ని రోజుల్లో ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకోవచ్చని, ఇందుకు మానసికంగా సిద్ధం కావాల్సిందేనని బీఆర్ఎస్​ నేత ఒకరు కామెంట్ చేశారు. కవిత విషయంలో సీబీఐ తదుపరి చర్యలకు ఉపక్రమించకుండా ఉండేందుకు కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడలు వేయబోతున్నారనేదానిపైనా బీఆర్​ఎస్​లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.