లోక్ సభ ఎన్నికలు: ఢిల్లీలో త్రిముఖ పోరు

లోక్ సభ ఎన్నికలు: ఢిల్లీలో త్రిముఖ పోరు

ఢిల్లీలో త్రిముఖ పోరు జరగబోతోంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ ఒంటరిగానే తలపడబోతున్నాయి. ఆప్ తో పొత్తు ఉండదని షీలాదీక్షిత్ ప్రకటించడంతో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీతో కాంగ్రెస్ అనధికార పొత్తు పెట్టుకుందని ఆప్ ఆరోపించగా.. కేజ్రీవాల్ అతిగా ఊహించుకుంటున్నారని కాంగ్రెస్ కౌంటరిచ్చింది. నిన్న పార్టీ చీఫ్ తో చర్చించిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ .. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో పాటే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా బీజేపీని ఓడించేందుకు కలిసిపోతామనే సంకేతమిచ్చారు. అయితే సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. కాంగ్రెస్ తీరుపై అసహనంతో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు కేజ్రీవాల్. అయినా అప్ తో పొత్తు కోసం రాహుల్ ప్రయత్నించారు. ఢిల్లీ నేతలతో చర్చించారు. కాంగ్రెస్ కు రెండు సీట్లు మాత్రమే ఇస్తామని కేజ్రీవాల్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఒంటరి పోరుకే సిద్ధమైంది కాంగ్రెస్. ఇదిలా ఉండగా.. ఏడు సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.