ఈ ఏడాది పిబ్రవరిలో జరిగిన ఢిల్లీ హింసాత్మక ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్యపై ఢిల్లీ పోలీసులు చెబుతున్న సంఖ్య కరెక్ట్ గా లేదన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్. అఫిడవిట్లలో మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపడం ద్వారా పోలీసులు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. దీనికి సంబంధించి గురువారం ఆమె ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్‌ఎన్.శ్రీవాస్తవకు లేఖ రాశారు. ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన పలు అఫిడవిట్లు, బహిరంగ ప్రకటనల్లో మృతుల సంఖ్యను 53గా చెప్పుకుంటూ వస్తున్నారని తెలిపారు. గుర్తుతెలియని మృతులుగా నమోదు చేసిన వారిని ఆ తర్వాత పోలీసులు గుర్తించినా ఆ వివరాలను అఫిడవిట్లలో చేర్చలేదని ఆమె ఫిర్యాదు చేశారు.
