ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు ​ఇంకొన్నాళ్లు బంద్

ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు ​ఇంకొన్నాళ్లు బంద్
  • మళ్లీ ఉత్వర్వులు ఇచ్చేదాకా విద్యాసంస్థల మూసివేత
  • పొల్యూషన్ కట్టడిపై సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం వివరణ
  • కొందరు ఫైవ్ స్టార్ హోటళ్లలో కూర్చుని రైతులపై నిందలేస్తున్నరన్న కోర్టు 
  • విచారణ ఈ నెల 24కు వాయిదా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఇంకా తీవ్రంగా ఉన్నందున స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల మూసివేతను కొనసాగిస్తున్నామని సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని చెప్పింది. కన్ స్ట్రక్షన్, డిమాలిషన్ కార్యకలాపాలను ఈ నెల 21 దాకా నిషేధించినట్లు పేర్కొంది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ పై పర్యావరణ కార్యకర్త ఆదిత్య దూబే, లా స్టూడెంట్ అమన్ బాంకా దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన బెంచ్ మరోసారి విచారించింది. ఎయిర్ క్వాలిటీ కమిషన్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ఈ సందర్భంగా కేంద్రం, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. పొల్యూషన్ తగ్గించేందుకు తాము తీసుకుంటున్న చర్యలను ఢిల్లీ ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ గోపాల్ రాయ్  కోర్టుకు వివరించారు. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను ఆదివారం దాకా పొడిగించామన్నారు. వెయ్యి సీఎన్జీ బస్సులను అద్దెకు తీసుకుని నడిపిస్తామని, ఈ ప్రాసెస్ గురువారం నుంచి మొదలుపెడ్తామన్నారు. ఢిల్లీలోకి అత్యవసర వస్తువులు తెచ్చేవి తప్ప ఇతర ట్రక్కుల రాకను నిషేధించామని మంత్రి తెలిపారు. 

కమిషన్ నిర్ణయాలు అమలు చేయండి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో పొల్యూషన్ కట్టడి కోసం మంగళవారం కేంద్రం, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ అధికారులతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ మీటింగ్ నిర్వహించింది. ఇందులో ఇండస్ట్రీలు, థర్మల్ ప్లాంట్లు, వాహనాల పొల్యూషన్, గాలిలో దుమ్ము, డీజిల్ జనరేటర్ల వాడకాన్ని కంట్రోల్ చేయడం, వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించడం వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నారు. నవంబర్ 30 దాకా ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 థర్మల్ పవర్ ప్లాంట్లలో 5 ప్లాంట్లు మాత్రమే పని చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంపై జరిగింది ఇక చాలు అని, కమిషన్ నిర్ణయాలను అమలు చేయాలని కోర్టు ఈ సందర్భంగా తేల్చిచెప్పింది.