ఢిల్లీలో రేపటి నుంచి స్కూళ్లు రీఓపెన్

ఢిల్లీలో రేపటి నుంచి స్కూళ్లు రీఓపెన్

 దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) అతితీవ్ర స్థాయి(450కి మించి)లో ఉంది. దాంతో అధికారులు కాలుష్య నియంత్రణ ప్రణాళిక " గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ)" ద్వారా ఈ నెల 5 నుంచి స్టేజ్ 4 నిబంధనలు అమలు చేశారు. హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఓవర్‌‌బ్రిడ్జిలు, పవర్ ట్రాన్స్‌‌మిషన్, పైపులైన్ల నిర్మాణ పనులపై నిషేధం విధించారు. ఢిల్లీలోకి డీజిల్ గూడ్స్, హెవీ గూడ్స్ వాహనాలతో పాటు పలు వెహికల్స్ రాకపోకలను నిలిపివేశారు. 

ఈ చర్యలతో ఏక్యూఐ 128 పాయింట్లు తగ్గి 450 నుంచి 322కు చేరింది. అంటే పొల్యూషన్ అతి తీవ్ర స్థాయి నుంచి తీవ్రస్థాయికి పడిపోయినట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌‌మెంట్ కమిషన్ శనివారం వెల్లడించింది. అందువల్ల  స్టేజ్ 4 ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, పొల్యూషన్ ఇంకా తీవ్రస్థాయి(ఏక్యూఐ 301 నుంచి400)లో ఉన్నందున  స్టేజ్ 1,2, 3లను కొనసాగించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 

మరికొన్ని రోజుల్లో ఏక్యూఐలో మెరుగుదల కనిపించే చాన్స్ ఉందని తెలిపారు. గాలి నాణ్యతను బట్టి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. పొల్యూషన్ స్థాయి కొంత తగ్గడంతో  ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు సోమవారం నుంచి రీఓపెన్ కానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.