ఢిల్లీలో అల్లర్లు పరువు తీసేందుకే: లక్ష్మణ్

ఢిల్లీలో అల్లర్లు పరువు తీసేందుకే: లక్ష్మణ్
  •                 మోడీ ఇమేజీ దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నరు
  •                 అసద్​ మరో జిన్నా.. ఒవైసీ బ్రదర్స్​ను కేసీఆర్ కాపాడుతున్నరు
  •                 అక్బర్​ కామెంట్లపై కేటీఆర్​ఎందుకు స్పందించలేదు?

సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్(సీఏఏ)కు మతం రంగు పులిమి టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. ఆ పార్టీల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గమనించాలని కోరారు. సీఏఏపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశంలో పుట్టి పెరిగిన వారికి ఎలాంటి నష్టం వాటిల్లబోదని చెప్పారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్‌ ట్రంప్‌ ఇండియా వచ్చిన సమయంలో ప్రధాని మోడీని వ్యతిరేకించే శక్తులు ఉద్దేశపూర్వకంగా ఢిల్లీలో అల్లర్లు, ఘర్షణలు సృష్టించారని చెప్పారు. ప్రధాని మోడీ ఇమేజీని, దేశ ప్రతిష్టను దిగజార్చడానికే ఇంతటి కుట్ర చేశారని ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు ఇండియా పరువు తీయాలనేది, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీయాలనేది వాళ్ల ఉద్దేశమన్నారు. మోడీ తనకు మంచి స్నేహితుడే అయినా ద్వైపాక్షిక అంశాల్లో మొండోడని ట్రంప్‌ ప్రశంసించారంటే దేశం విషయంలో మోడీ కమిట్‌మెంట్‌ ఏంటో తెలిసిపోతుందన్నారు.

వారి చేతుల్లోకి తుపాకులెలా వచ్చాయ్

‘ఢిల్లీలో రెచ్చిపోయిన ఆందోళనకారులు సామాన్య ప్రజలే అయితే వాళ్ల చేతుల్లోకి తుపాకులెలా వచ్చాయి. టెర్రరిస్టు కార్యకలాపాలకు కుహనా మేధావులు, కమ్యూనిస్టులు ఊతమివ్వడం ఏమిటి. వాళ్లు దేశానికి మంచి చేస్తున్నారో, చెడు చేస్తున్నారో ఆలోచించుకోవాలి”అని లక్ష్మణ్​ సూచించారు. పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా(పీఎఫ్‌ఐ), భీం ఆర్మీ వెనుక ఎవరున్నారో బయటికి రావాలన్నారు. ప్రధానికి ట్రంప్​ ఇచ్చిన గౌరవాన్ని చూసి మోడీ వ్యతిరేకశక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ఇండో–యూఎస్ మధ్య జరిగిన ఒప్పందాలను నీరుగార్చడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అల్లరిమూకలు తమపై దాడి చేస్తుంటే ఆత్మరక్షణకు బీజేపీ నాయకులు ప్రయత్నించారని లక్ష్మణ్​ చెప్పారు. కానీ, కొందరు కావాలనే బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ గౌరవానికి భంగం కలిగించేలా, అశాంతి, అలజడి సృష్టించేలా వ్యవహరిస్తున్న శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

వారిని కేసీఆరే కాపాడుతున్నరు

మహ్మద్‌ అలీ జిన్నా దేశ విభజనకు కారకుడని, సీఏఏ పేరుతో దేశంలో అలజడి సృష్టించాలని చూస్తోన్న అసదుద్దీన్‌ ఒవైసీ మరో జిన్నా అని లక్ష్మణ్​ అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన ఘటనలపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. వారిస్‌ పఠాన్‌ కామెంట్లపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అక్బరుద్దీన్‌ కామెంట్లపై సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. వారిద్దరిని కేసీఆర్, కేటీఆర్‌లే కాపాడుతున్నారని ఆరోపించారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని కేసీఆర్‌, కేటీఆర్‌ కోరడం దురదృష్టకరమన్నారు.