
భారీ అంచనాలతో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda )కథనాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'కింగ్ డమ్' ( Kingdom ). గౌతమ్ తిన్ననూరి ( Goutham Tinnanuri ) దర్శకత్వంలో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా మూవీ జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇటీవలే 'అన్నా అంటూనే. అనే ప్రోమో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. కింగ్ డమ్ విడుదలకు సిద్ధమవుతున్న వేళ విజయ్ ప్రచార కార్యక్రమాలల్లో ఎందుకు పాల్గొనడం లేదన్న సందేహం అభిమానుల్లో నెలకొంది.
అయితే అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసే వార్త ఒకటి గుప్పుమంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీని కారణంగానే ఆయన ప్రమోషన్స్ లలో కూడా పాల్గొనలేకపోతున్నారని సమాచారం. ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతూ విజయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జూలై 20 నాటికి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సినీ వర్గాలు తెలిపాయి.
దీంతో మరో మూడు రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య పరిస్థితిపై విజయ్ కానీ, ఆయన బృందం కానీ, ఆసుపత్రి వర్గాలు కానీ అధికారిక ప్రకటన చేయలేదు. దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కింగ్ డమ్ జూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కు ముందే విజయ్ కి ఆరోగ్య సమస్యలు రావడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
గౌతమ్ తిన్ననూరి, 'జెర్సీ' వంటి ఎమోషనల్ హిట్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో 'కింగ్‌డమ్'పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే ( Bhagyashree Borse ) , బ్రదర్స్‌గా సత్యదేవ్ ( Satya Dev ) నటిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ , ఫార్చూనర్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించారు..