
టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పార్టీకి రాజీనామా చేశారు. గోవా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్న క్రమంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు అశోక్ గజపతి రాజు. ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజకీయ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే గోవా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు అశోక్ గజపతి రాజు.
ఈ క్రమంలో ఇప్పటిదాకా అనేక అవకాశాలు కల్పించిన టీడీపీఎం పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అశోక్ గజపతి రాజు. ఈమేరకు సీఎం చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు రాజీనామా లేఖ పంపారు అశోక్ గజపతిరాజు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు అశోక్ గజపతి రాజు. సుదీర్ఘ రాజకీయ, పాలనా అనుభవం ఉన్న ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పీఎస్ శ్రీధరన్ పిల్లై స్థానంలో ఆయన గోవా గవర్నర్ గా బాధ్యతలు తీసుకోనున్నారు.
జులై 14న మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు. హర్యానా, గోవాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటన వెలువరించింది.
కొత్త గవర్నర్లలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియామకం అయ్యారు. హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ ను నియమించారు. యూనియన్ టెరిటరీ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా నియామిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.