బెంగళూరులో 1.5 కిలోమీటర్ల ప్రయాణానికి 3 లీటర్ల పెట్రోల్ ఖర్చు.. ట్రాఫిక్ జామ్స్‌పై టెక్కీ ఆగ్రహం!

బెంగళూరులో 1.5 కిలోమీటర్ల ప్రయాణానికి 3 లీటర్ల పెట్రోల్ ఖర్చు.. ట్రాఫిక్ జామ్స్‌పై టెక్కీ ఆగ్రహం!

ఇండియన్ సిలికాన్ వ్యాలీ, టెక్ రాజధాని అని పిలుచుకుంటున్న బెంగళూరు ప్రస్తుతం టెక్కీలకు చుక్కలు చూపిస్తోంది. ఎక్కువ సమయం ఉద్యోగులు ట్రాఫిక్స్ జామ్స్ లోనే గడపాల్సి రావటంపై ఆందోళనలు పెరిగిపోతున్నాయి. కనీసం తమను పట్టించుకునే వారు కూడా లేరంటూ తమ అనుభవాలను వారు పంచుకుంటున్నారు. మరికొందరైతే బెంగళూరును వదిలి వేరే నగరానికి వెళ్లటం సుఖమని అంటున్నారు. 

తాజాగా బెంగళూరులోని సర్జాపూర్ ఓఆర్ఆర్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అనుభవాన్ని ఒక టెక్కీ పంచుకున్నారు. తాను కేవలం ఒకటిన్నర కిలోమీటరు ప్రయాణం చేసేందుకు 3 లీటర్ల పెట్రోల్ ఖర్చయిందని చెప్పటం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. ట్రాఫిక్ నిలిచిపోవటంతో తన కారు డ్యాష్ బోర్డు పొటోలో ఇంధనం ఖర్చైన తీరును సోషల్ మీడియాలో పెట్టాడు. మరో వ్యక్తి 3.3 కిలోమీటర్ల ప్రయాణానికి 45 నిమషాలు సమయం పట్టిందని ఇందుకోసం 3.3 లీటర్ల ఇంధనం ఖర్చయినట్లు పంచుకున్నారు. తన కారు సగటున 8 నుంచి 15 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చేదని.. కానీ ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు లీటరుకు 3 నుంచి 6 కిలోమీటర్లు కూడా రావటం లేదని అన్నాడు. 

తాము గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నప్పుడు ఏసీ రన్నింగ్ కోసమే ఎక్కువ ఆయిల్ అయిపోతోందని వారు చెబుతున్నారు. బెంగళూరులో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు తమ ఓర్పును పరీక్షిస్తున్నాయని.. జామ్ సమయంలో అంగుళం, అంగుళం కదులుతూ ఇంటికి చేరటం ఇబ్బందిగా ఉంటోందని అన్నారు. అయితే దీనికి ఎవ్వరూ పరిష్కరించటం లేదని అంటున్నారు. 

చాలా వాహనదారులు కనీసం కిలోమీటరు వెళ్లాలన్నా లీటరుకు పైనే పెట్రోల్ ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇది వారికి భరించరాని భారంగా మారుతోందని వారు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తట్టుకునే స్థాయిలో అసలు రోడ్లు, వంతెనలు అస్సలు లేవని నితిన్ మల్లిఖార్జున్ అనే టెక్కీ చెప్పారు. బస్సు సర్వీసులను పెంచటంతో పాటు కంపెనీలు సొంత బస్సులను తీసుకురావాలని ఉద్యోగుల రవాణా కోసం ఆయన కోరారు. 

తక్కువ దూరాలకు కూడా లీటర్లకు లీటర్లు పెట్రోల్, డీజిల్ మండించటం పర్యావరణానికి కూడా హీని కలిగిస్తుందని బెంగళూరు ప్రజలు అంటున్నారు. ఇదే సమయంలో ఆరోగ్యానికి, ఆర్థికంగా కూడా ఈ ధోరణి సరైనది కాదని అంటున్నారు. చాలా మంది ఈ విషయంలో ప్రభుత్వ చర్యలను నిందిస్తు్న్నారు. ముందు చూపు లేమి, అవసరానికి చర్యలకు ఉన్న భారీ వ్యత్యాసం నగరంలో ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తోందని వారు అంటున్నారు. ఇదే క్రమంలో మెట్రో సేవల రాకకు మరింత ఆలస్యం పరిస్థితులను రోజురోజుకూ దిగజారుస్తున్నాయని బెంగళూరులోని ఉద్యోగులు చెబుతున్నారు.