డీలిమిటేషన్‌‌‌‌కు జీఎస్డీపీ లింక్! ‘50-50 గ్రోత్ ఫార్ములా’.. సౌత్కు అన్యాయం జరగకుండా కొత్త ప్రపోజల్‌‌‌‌

డీలిమిటేషన్‌‌‌‌కు జీఎస్డీపీ లింక్! ‘50-50 గ్రోత్ ఫార్ములా’.. సౌత్కు అన్యాయం జరగకుండా కొత్త ప్రపోజల్‌‌‌‌
  • 50 శాతం పెంపుతో అదనంగా 271 సీట్లు వస్తే అందులో సగం 136 స్థానాలు 
  • 7 రాష్ట్రాలకు కేటాయించాలని ప్రతిపాదన
  • ప్రస్తుతం జీడీపీలో తెలంగాణది 
  • 5 శాతం వాటా..ఈ లెక్కన 30  సీట్లకు పెరిగే చాన్స్​
  • రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా ఉంటదంటున్న ఎక్స్‌‌‌‌పర్ట్స్​
  • లేదంటే అంతరాలు ఎప్పటికీ అలాగే ఉంటాయని అభిప్రాయం
  • సీఎం రేవంత్‌‌‌‌ ప్రతిపాదనపై ఉన్నతస్థాయిలో చర్చ

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌‌‌‌) ప్రక్రియపై గందరగోళం నెలకొన్నది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే.. దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా  బలి  కావాల్సిందేనా? అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో  సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి తెరపైకి తెచ్చిన ‘జీఎస్డీపీ’ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)  ఫార్ములా జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెండ్ దక్కాలంటూ ఆయన ప్రతిపాదించిన ‘50-–50 గ్రోత్ ఫార్ములా’ కొత్త చర్చకు దారితీసింది. పార్లమెంట్‌‌‌‌లో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను దాదాపు 50 శాతం మేర పెంచి, సుమారు 815  సీట్లకు చేర్చాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం.

ఒకవేళ ఇది కాకపోతే గతంలో మాదిరి కేవలం ‘జనాభా’ ప్రాతిపదికన మాత్రమే చేపట్టే ఆప్షన్​ ఉంది. అయితే, ఈ రెండు ప్రతిపాదనలు కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జనాభా ప్రాతిపదికన చేస్తే కుటుంబ నియంత్రణ పాటించినందుకు, 50 శాతంతో చేస్తే ఇప్పటికే ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరాదిలో రాష్ట్రాలకు మరిన్ని సీట్లు అదనమై అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీరని అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

జీఎస్డీపీనే అస్త్రం..
దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలకు వారు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి పార్లమెంటులో ప్రాతినిథ్యం కల్పించాలని రేవంత్‌ ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా దాదాపు 5 శాతంగా ఉండగా, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి దేశ ఆర్థిక రథాన్ని 53 శాతంతో ముందుకు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  ఎన్ని ఎంపీ సీట్లు పెంచినా సరే..  ‘50–-50 గ్రోత్ ఫార్ములా’ ప్రకారం రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలనేది సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన. 

ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 815 కు పెంచితే, అదనంగా వచ్చే సీట్లు 272. ఈ ప్రతిపాదన ప్రకారం.. ఇందులో 50 శాతం అంటే 136 సీట్లను కేవలం దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న ఏడు రాష్ట్రాలకే (దక్షిణాది + పశ్చిమ రాష్ట్రాలు) కేటాయించాలి. ఈ 136 సీట్లను ఆయా రాష్ట్రాలకు ఎలా పంచాలి అనే చోటే  ‘జీఎస్డీపీ’ అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ 7 రాష్ట్రాలు ఉమ్మడిగా దేశ జీడీపీలో 53.37 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ప్రాతిపదికన ఈ 136  సీట్లను పంపిణీ చేస్తే, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పార్లమెంటులో తిరుగులేని బలం చేకూరుతుంది.

అన్ని రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ‘పవర్’​ ఉండేలా.. 
దేశ జీడీపీలో అత్యధికంగా 13.77 శాతం వాటా ఉన్న మహారాష్ట్రకు ఈ పూల్ నుంచి అత్యధికంగా 35 సీట్లు అదనంగా లభిస్తాయి. ఈ లెక్కన చూస్తే.. ప్రస్తుతం 17 సీట్లున్న తెలంగాణకు అదనంగా మరో 13 సీట్లు పెరిగి మొత్తం 30  స్థానాలకు చేరుకుంటుంది. దేశ జీడీపీలో 5.03 శాతం వాటా ఉన్న ఏపీకి 13 సీట్లు పెరిగి 25 నుంచి 38కి చేరుకుంటాయి. అలాగే 9.08 శాతం వాటా ఉన్న తమిళనాడుకు 23 సీట్లు పెరిగి తమిళనాడు 39 నుంచి 62కి, 8.46 శాతం వాటా ఉన్న గుజరాత్‌కు 22 సీట్లు పెరిగి  26 సీట్ల నుంచి 48కి,  మహారాష్ట్ర 35 సీట్లు పెరిగి 48 నుంచి 83కి, 8.41 శాతం వాటా ఉన్న కర్నాటక 21 సీట్లు పెరిగి 28  నుంచి 49కి చేరుకుంటాయి. 

3.63 శాతం వాటా ఉన్న కేరళకు 9 సీట్లు దక్కుతాయి. ఇలా దేశ జీడీపీలో ఆయా రాష్ట్రాలు కంట్రిబ్యూట్ చేసే శాతాన్ని బట్టి అదనపు సీట్లను కేటాయిస్తేనే,  కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా ఈ రాష్ట్రాల మద్దతు తప్పనిసరి అవుతుంది. జనాభా సాకుతో సంపద సృష్టించే రాష్ట్రాలను రాజకీయంగా బలహీనపర్చకుండా ఉండాలంటే ఈ ‘పెర్ఫార్మెన్స్ బేస్డ్’ సీట్ల కేటాయింపు ఒక్కటే మార్గమని  వాదిస్తున్నారు. 

ఉత్తరాది రాష్ట్రాల్లో నియంత్రితంగా పెరుగుతాయ్
మరోవైపు, మిగిలిన 135 అదనపు సీట్ల పంపిణీని గమనిస్తే, అక్కడ కూడా సీట్ల పెంపుదల ఉంటుంది.. కానీ అది దక్షిణాదితో పోలిస్తే నియంత్రితంగా ఉంటుంది. ఈ కొత్త ఫార్ములా ప్రకారం.. యూపీలో ప్రస్తుతం ఉన్న 80 సీట్లకు మరో 29 పెరిగి 109కి చేరుకుంటుంది. రాజస్థాన్‌లో 16 సీట్లు పెరిగి 41కి, మధ్యప్రదేశ్‌లో 14 సీట్లు పెరిగి 43కి చేరుకుంటాయి. పశ్చిమ బెంగాల్‌లో 13 సీట్ల పెరుగుదలతో 55కి, హర్యానాలో 11 సీట్లు పెరిగి 21కి స్థానాలు పెరుగుతాయి. ఇక బిహార్ లో 10 సీట్లు పెరిగి 50కి, ఒడిశాలో 8 సీట్లు పెరిగి 29కి, పంజాబ్‌లో 7 సీట్లు పెరిగి 20కి చేరుకుంటాయి.

ఇతర రాష్ట్రాల్లో కలిపి మరో 27 సీట్లు పెరుగుతాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 543 సీట్ల సమయంలో రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ అంతరం మరీ విపరీతంగా పెరిగిపోకుండా ఉంటుంది. సంఖ్య పెరిగినా, సభలో దక్షిణాది రాష్ట్రాల ఓటింగ్ బలం తగ్గిపోకుండా చూడటమే ఈ వ్యూహంలోని అసలు రహస్యం. ‘‘పన్ను ఆదాయం ఇచ్చేది ఒకరు.. పెత్తనం చేసేది మరొకరు’’ అనే విమర్శలకు తావులేకుండా, దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యానికి తగ్గట్టుగా రాజకీయ ప్రాతినిథ్యం కల్పించడమే ఈ ఫార్ములాలోని అసలు విశ్లేషణ. ఇది కేవలం సీట్ల పెంపు కాదు, దేశాభివృద్ధిలో పోటీ పడుతున్న రాష్ట్రాలకు ఇచ్చే ‘పొలిటికల్ డివిడెండ్’ అని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

ఎక్స్పర్ట్స్​ చెబుతున్నది హైబ్రీడ్​ మోడల్​ 
నిపుణుల విశ్లేషణ ప్రకారం, కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నా లేదా 50 శాతం ప్రాతిపదికన పెంచినా  భవిష్యత్తులో ఏ రాష్ట్రం కూడా జనాభా నియంత్రణను లేదా అభివృద్ధిని పట్టించుకోదు, ఎందుకంటే జనాభా పెరిగితేనే రాజకీయ బలం వస్తుందనే తప్పుడు సంకేతం వెళ్తుంది. ఇది అభివృద్ధి చెందిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుంది. అందుకే జనాభాకు 50 శాతం, జీఎస్డీపీకి 50 శాతం వెయిటేజీ ఇచ్చే ‘హైబ్రిడ్ మోడల్’ లేదా పూర్తిగా జీఎస్డీపీ ఆధారిత పెంపుదలపై చర్చ జరగాలని మేధావులు కోరుతున్నారు.

‘‘పన్నులు కట్టేది మేం.. పెత్తనం చేసేది వాళ్లా?’’ అన్న దక్షిణాది రాష్ట్రాల అసంతృప్తికి కొత్త ప్రపోజల్​ఒక పరిష్కార మార్గంగా కనిపిస్తున్నది. బాధ్యతాయుతంగా దేశ ఆర్థిక వ్యవస్థను సాదుతున్న రాష్ట్రాలకు చట్టసభల్లో ప్రాముఖ్యత పెరగాలని, లేదంటే ఉత్తర,- దక్షిణ రాష్ట్రాల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలు మరింత పెరిగి దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పన్ను చెల్లింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని రాజకీయ ప్రాతినిథ్యంతోనైనా భర్తీ చేయాలన్నదే ఈ కొత్త సూత్రం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు.