- జిల్లా స్థాయిలో చేయాల్సిన బదిలీలు.. కమిషనర్ స్థాయిలో చేసేలా మార్పు
- రూల్స్ విషయంలో మంత్రి జూపల్లి చెప్పినా వినకుండా సొంత నిర్ణయాలు
- అసంతృప్తిలో 2 వేలకు పైగా ఎక్సైజ్ కానిస్టేబుల్స్
- ఇయ్యాల ఎక్సైజ్ అధికారుల సంఘం సమావేశం
- కమిషనర్ దుర్భాషలు, ఇష్టారీతిన బదిలీలపై చర్చించి కార్యాచరణ ప్రకటించే చాన్స్
రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో బదిలీల పర్వం పెను దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే అధికారులపై నోరు పారేసుకుంటున్న కమిషనర్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతుండగా ఇప్పుడు బదిలీలపై రచ్చ జరుగుతున్నది. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో జరగాల్సిన కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలను కమిషనర్ తన చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో బదిలీల పర్వం పెను దుమారాన్ని రేపుతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్ల బదిలీల వ్యవహారం కమిషనర్ మొండి వైఖరితో వివాదాస్పదంగా తయారైంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖలోని అధికారులపై నోరు పారేసుకుంటున్న కమిషనర్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా ఇప్పుడు బదిలీలపై రచ్చ జరుగుతోంది. సాధారణంగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో జరగాలి. కానీ, ఈసారి కమిషనర్ ఆ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
అటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, ఉన్నతాధికారులు తమకు నచ్చినట్లుగా నిబంధనలను సవరించడంపై కిందిస్థాయి సిబ్బందిలో భగ్గుమంటోంది. మొత్తం 3 వేలకు పైగా బదిలీలు చేయగా అందులో దాదాపు 2500 మంది కానిస్టేబుళ్లు ఈ నిర్ణయాలతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లాలు దాటి బదిలీలు కావాలనే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో ముసలానికి దారితీస్తున్నాయి. ఒకవైపు కమిషనర్ దుర్భాషలాడటం, ఇంకోవైపు బదిలీల విషయాల్లో ఏకపక్ష నిర్ణయాలపై ఎక్సైజ్ అధికారుల సంఘం సోమవారం అత్యవసర సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమైంది.
బదిలీలపైనా సొంత నిర్ణయమే..
పాలనా వ్యవస్థలో మంత్రి నిర్ణయాలే శిరోధార్యంగా ఉండాలి కానీ, ఎక్సైజ్ శాఖలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కానిస్టేబుళ్ల బదిలీల్లో సానుకూలంగా స్పందించి, కొన్ని మార్గదర్శకాలు సూచించినప్పటికీ, కమిషనర్ వాటిని బుట్టదాఖలు చేశారు. సీఎంఓను సైతం కమిషనర్ తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది.
దూరం జిల్లాలకు బదిలీ చేస్తే గంజాయికి అడ్డుకట్ట పడుతుందని కమిషనర్ సీఎంఓకు చెప్పి రూల్స్ మార్చినట్లు సమాచారం. కొందరు ఎక్కడ బదిలీ చేసినా తమ బుద్ధి చూపెట్టుకుంటారని.. అలా అని మొత్తం వ్యవస్థను తప్పు పట్టేలా బదిలీ నిబంధనలు మార్చడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు దూరంగా వెళ్లాల్సి వస్తుందని, ఫలితంగా ఉద్యోగ నిర్వహణపైనా ప్రభావం పడుతుందని చెప్పినా కమిషనర్ వినిపించుకోలేదనే చర్చ జరుగుతున్నది.
మంత్రి మాటలు బేఖాతరు
మంత్రి చెప్పిన మాటలను బేఖాతరు చేస్తూ, సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్న తీరు వారి మధ్య ఉన్న అంతరాన్ని బయటపెడుతోంది. దీనికి తోడు కమిషనర్ స్థాయి అధికారి కింది స్థాయి సిబ్బందితో మాట్లాడే తీరు, వారిపై వాడుతున్న భాష వివాదాస్పదంగా మారింది. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే దుర్భాషలాడటం, ఇష్టారీతిన నిబంధనలు విధిస్తానని బెదిరించడం వంటి పరిణామాలు కానిస్టేబుళ్లను మానసిక వేదనకు గురిచేస్తున్నాయి. బదిలీల్లో సుదీర్ఘ కాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా, నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకోవడం వెనుక పెద్ద స్కామ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భార్యాభర్తలు ఒకే చోట పనిచేయాలనే నిబంధన ఉన్నప్పటికీ, దానిని అమలు చేయకుండా 'అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్' పేరుతో కొర్రీలు పెట్టారు. అలాగే, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించినా, వాటిని కమిషనర్ కార్యాలయం తోసిపుచ్చింది. మ్యూచువల్ బదిలీల విషయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు అంగీకరించినా, వారి మధ్య సర్వీసు సీనియారిటీ వ్యత్యాసం ఉండకూడదనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు. ఇది వాస్తవానికి అమలు చేయడం అసాధ్యమని తెలిసినా, బదిలీలను అడ్డుకోవడానికే ఇలాంటి మెలికలు పెట్టారని స్పష్టమవుతోంది.
