టెండరు పిలవరు.. ఉపాధి చూపరు..విధులకు దూరంగా సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు

టెండరు పిలవరు.. ఉపాధి చూపరు..విధులకు దూరంగా సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు
  •     కొత్త టెండర్​ కోసం 213 మంది గార్డుల ఆందోళనలు
  •     లైట్​ తీసుకుంటున్న సింగరేణి యాజమాన్యం

కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్, వెలుగు: టెండరులో జాప్యం కారణంగా సింగరేణిలో గార్డులుగా పనిచేస్తున్న వారు ఉపాధికి దూరమై ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి కార్మిక కుటుంబాలకు చెందిన పలువురు ప్రైవేటు గార్డులుగా పనిచేస్తున్నారు.  అయితే టెండర్లలో నెలకొన్న గందరగోళంతో 11 ఏళ్లుగా ఉపాధి పొందుతున్న 213 మంది గార్డులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. రోజులు గడిచినా విధులకు పిలవకపోవడంతో వారు ఉద్యమబాట పట్టారు. కొత్త టెండర్ పిలిచి తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నప్పటికీ యాజమాన్యం స్పందించడంలేదని ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో పనిచేస్తున్న ఈ గార్డులు 40 రోజులుగా విధులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

తక్కువ జీతానికే గార్డులుగా విధులు..

సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణ, బొగ్గు గనులు, విభాగాల్లో చోరీలను అరికట్టేందుకు అంతర్గతంగా ఎస్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌పీసీ విభాగం ఉన్నప్పటికీ, 2015లో యాజమాన్యం ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను కూడా నియమించింది. భూ నిర్వాసితులు, కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్ ప్రాంత నిరుద్యోగులు, సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులకు ఈ అవకాశాలు కల్పించారు. మందమర్రి ఏరియాలో కూడా పలు దఫాలుగా 213 మందిని గార్డులుగా తీసుకొని విధులు కల్పించారు. తక్కువ వేతనాలకైనా స్థానికులు ఈ ఉద్యోగాలపై ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నారు.

కొత్త టెండర్‌‌‌‌‌‌‌‌లో గందరగోళం..

ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను యాజమాన్యం రెండేళ్లకోసారి టెండర్ ద్వారా నియమిస్తుంది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ గార్డులకు డ్యూటీలు, వేతనాలు తదితర వ్యవహారాలు చూస్తారు. మందమర్రి ఏరియాలో పదేళ్లుగా 213 మంది గార్డులు విధులు నిర్వహిస్తున్నారు. 2023 మార్చిలో వీపీ వర్గీస్ సెక్యూరిటీ సంస్థకు టెండర్ లభించింది. 2025 మార్చిలో కాంట్రాక్ట్ ముగియడంతో 130 మంది కోసం కొత్త టెండర్ పిలిచారు. అయితే ఎంపిక ప్రక్రియలో అభ్యంతరాలు రావడంతో సమస్య తలెత్తింది. చివరికి పాత కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కే టెండర్‌‌‌‌‌‌‌‌ను ఏడాది పొడిగించారు. 2026 ఫిబ్రవరి 28తో అది కూడా ముగిసింది. జనవరిలో మరోసారి 90 మంది కోసం టెండర్ పిలిచినా నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో విషయం కోర్టుకు వెళ్లింది. దీంతో టెండర్ ప్రక్రియ నిలిచిపోయి 213 మంది గార్డులు ఉపాధి కోల్పోయారు.

ఆందోళన బాటలో గార్డులు

కొత్త టెండర్ పిలిచి తమకు తిరిగి ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ గార్డులు అధికారులను, కార్మిక సంఘాల నాయకులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి కూడా తమ సమస్య వివరించారు. జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సీఐటీయూ అనుబంధ కాంట్రాక్ట్ కార్మిక సంఘం గార్డులకు మద్దతు ప్రకటించింది. గత ఆరు రోజులుగా ర్యాలీలు, ధర్నాలు, భిక్షాటన కార్యక్రమాలు నిర్వహిస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు. 40 రోజులుగా ఉపాధి లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, పాత పోస్టులను కొనసాగిస్తూ కొత్త టెండర్ పిలిచి ఉపాధి కల్పించాలని గార్డులు కోరుతున్నారు.