డీలిమిటేషన్‌‌పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు

డీలిమిటేషన్‌‌పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం :  బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్  రాంచందర్ రావు
  •     దక్షిణాదికి సీట్ల సెగ లేదు.. అంతా రాజ్యాంగబద్ధమే 
  •     జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన ఉండదు
  •     బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్  రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కాంగ్రెస్, ఇండీ కూటమి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి, ఉత్తరాదికి లాభం జరుగుతుందంటూ కాంగ్రెస్  చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఓట్ల కోసం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే రాజకీయాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. 

డీలిమిటేషన్ అనేది ప్రతి జనగణన తర్వాత జరిగే సాధారణ రాజ్యాంగ ప్రక్రియ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్  చెబుతున్నట్లుగా కేవలం జనాభా ఆధారంగానే సీట్ల కేటాయింపు జరగదని, ఒకవేళ అదే నిజమైతే.. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో తక్కువ జనాభా ఉన్నా సీట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న అసెంబ్లీ సెగ్మెంట్లను బేస్  చేసుకుని ప్రపోర్షనేట్​గా సీట్ల పెంపు ఉంటుందని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది అబద్ధమన్నారు. 2026 సెన్సస్ తర్వాత ఏర్పాటు చేసే డీలిమిటేషన్ కమిషన్ అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తుందని ఆయన వివరించారు. 

సుప్రీం తీర్పుపై హర్షం.. 

మతం మారిన వ్యక్తులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తున్నదని రామచందర్ రావు పేర్కొన్నారు. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం చరిత్రాత్మకమని కొనియాడారు. ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడులు చేస్తున్న శక్తులకు ఈ తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును తక్షణమే క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు.