డెల్టా వేరియంట్‌తో భారీ ముప్పు.. దీన్ని తరిమికొడదాం

డెల్టా వేరియంట్‌తో భారీ ముప్పు.. దీన్ని తరిమికొడదాం

వాషింగ్టన్ డీసీ: డెల్టా వేరియంట్‌తో భారీ ముప్పు పొంచి ఉందని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు. ముఖ్యంగా కరోనాను తుదముట్టించే పనుల్లో సఫలమైన అమెరికాకు డెల్టా వేరియంట్‌ ప్రమాదకారిగా మారే అవకాశాలు ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.

‘తొలిసారిగా భారత్‌లో కనుగొన్న డెల్టా వేరియంట్ ఇప్పుడు చాలా దేశాలకు వ్యాపించింది. యూఎస్‌లో నమోదవుతున్న తాజా కేసుల్లో 20 శాతం డెల్టా వేరియంట్‌వేనని తేలింది. గత రెండు వారాల్లో ఈ తరహా కేసులు 10 శాతం పెరిగాయి. యూకేలాగే యూఎస్‌కు డెల్టా వేరియంట్‌తో ముప్పు పొంచి ఉంది. కరోనాను తరిమికొట్టే మన ప్రయత్నాలకు ఇది అడ్డుపడుతోంది. అయితే డెల్టా వేరియంట్‌పై యూఎస్‌లోని వ్యాక్సిన్‌లు ప్రభావవంతంగా పని చేస్తుండటం శుభపరిణామం. ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాటితో దీన్ని నాశనం చేద్దాం’ అని ఫౌసీ పిలుపునిచ్చారు.