శివారుల్లోని ఇండివిడ్యువల్ ఫాంహౌస్​లకు డిమాండ్

శివారుల్లోని ఇండివిడ్యువల్ ఫాంహౌస్​లకు డిమాండ్

సమ్మర్ కావడంతో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ తో వెళ్తున్న జనం
సౌకర్యాలను బట్టి రోజుకు 6 వేల నుంచి 15 వేల వరకు చార్జీలు

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్​ శివారు ప్రాంతాల్లోని ఇండివిడ్యువల్ ఫాంహౌస్ లకు ప్రస్తుతం డిమాండ్​పెరిగింది. బర్గ్​డే పార్టీ అయినా, వీకెండ్ ఔటింగ్​అయినా సిటీ జనం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికే వెళ్తున్నారు. రెండు, మూడ్రోజులు స్టే చేస్తున్నారు. కొన్ని కంపెనీలు ఫాంహౌస్​లలోనే స్టాఫ్​తో మీటింగ్స్​నిర్వహిస్తున్నాయి. ఫాంహౌస్, అందులోని సౌకర్యాలను బట్టి నిర్వాహకులు ఒక్కరోజుకి రూ.6 వేల నుంచి రూ.15 వేలు, మరీ పెద్దవైతే అంతకు మించి చార్జ్​చేస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల కింద వరకు నడిచిన ఫాంహౌస్​లను చాలా వరకు క్లోజ్ చేశారు. ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో తిరిగి ఓపెన్​చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు తగిన విధంగా రెడీ చేస్తున్నారు. కొన్ని చిన్న రిసార్టుని తలపిస్తున్నాయి. సమ్మర్​కావడం, పిల్లలకు సెలవులు ఉండడంతో కొంత మంది కుటుంబ సమేతంగా వెళ్లి అక్కడి రెండు మూడు రోజులు ఉండి ఎంజాయ్​చేస్తున్నారు. బర్త్​డే పార్టీలు, చిన్నచిన్న ఫంక్షన్లు కూడా జరుపుకుంటున్నారు. ఎక్కువగా వీకెండ్ పార్టీలు, ఫ్యామిలీ ఔటింగ్ కోసం వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వీకెండ్స్​లో ఎక్కువ బుక్కింగ్స్ ఉంటున్నాయని వివరిస్తున్నారు. కొన్ని ఫాం హౌస్​లు వారం ముందు బుక్ చేసుకుంటే తప్ప దొరకని పరిస్థితి ఉంది.

అన్ని ఒకే చోట..

ఫాంహౌస్ చుట్టూ పచ్చని చెట్లు, స్విమ్మింగ్ పూల్, పిల్లల కోసం ప్రత్యేకంగా పార్కు, మ్యూజిక్ సిస్టం ఇలా ఫాంహౌస్ లలో అన్ని రకాల ఏర్పాట్లు ఉంటున్నాయి. సొంతగా ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఒకవేళ కస్టమర్లకు చెఫ్​అవసరం ఉంటే నిర్వాహకులు అరేంజ్​చేస్తున్నారు.ఇందుకు ప్రత్యేక చార్జీ ఉంటుంది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్​తో రిసార్టులకు వెళ్లేవారు ఇప్పుడు ఫాంహౌస్​ల బాట పడుతున్నారు. సిటీలో బిజినెస్ చేసేవారు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రిలాక్స్​అయ్యేందుకు ఎక్కువగా వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

సిటీ చుట్టూ 3వేలకు పైనే..

సిటీ శివారు ప్రాంతాల్లోని మొయినాబాద్, శామీర్ పేట, శంషాబాద్, ఘట్ కేసర్, ఇబ్రహీంపట్నం, శంకరపల్లి, యాదాద్రి, భవనగిరి, హయత్​నగర్ తదితర ప్రాంతాల్లో 3వేలకు పైగా ఫాంహౌసులు ఉన్నాయి. సొంతగా నిర్మించుకున్న వారు కొందరు లీజుకు ఇస్తుండగా, మరికొందరు ఓనర్ల నుంచి లీజుకు సిటీ నుంచి వెళ్లే వాళ్లకు అద్దెకు ఇస్తున్నారు. కరోనా టైంలో జనం రాక లీజుకు తీసుకున్నవారు ఈ బిజినెస్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారడంతో మళ్లీ డిమాండ్ పెరిగింది. అవే ఫాంహౌస్​లను లీజుకి తీసుకొని బిజినెస్​ రీస్టార్ట్ చేస్తున్నారు.

బుకింగ్స్​ పెరుగుతున్నయ్

కరోనాతో బిజినెస్ లేకపోవడంతో కొన్నాళ్లుగా ఫాంహౌస్​ను క్లోజ్ చేశాం. గత నెలలో తిరిగి ప్రారంభించాం. బుక్కింగ్స్ పెరుగుతున్నయ్. ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీసులకు సంబంధించిన మీటింగ్స్, వీకెండ్​ పార్టీల కోసం అడుగుతున్నారు. 
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- రాఘవ్, ఓ ఫామౌస్ నిర్వాహకుడు

చిన్న చిన్న ఫంక్షన్లు చేస్కోవచ్చు

ఫ్యామిలీతో కలిసి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు ఫాంహౌస్​లు బాగుంటాయి. పార్టీ తర్వాత అంతా కలిసి ఒకేచోట స్టే చేసేందుకు వీలుగా ఉన్నాయి. నేను నెలకోసారైనా ఫాంహౌస్​కి వెళ్తాను. ఎలాంటి డిస్ట్రబెన్స్​లేకుండా ఎవరికి వాళ్లు ఎంజాయ్ చేయొచ్చు. 
- విష్ణు, ​బండ్లగూడ