యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం నుంచి స్వామివారి అలంకార, వాహన సేవలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 నుంచి 26 వరకు ఉదయం అలంకార సేవలు, రాత్రి వాహన సేవలు నిర్వహించనున్నారు.
శుక్రవారం ఉదయం స్వామివారిని మత్స్యావతార అలంకారంలో మాడవీధుల్లో ఊరేగించారు. రకరకాల పూలు, ఆభరణాలతో స్వామివారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యజ్ఞాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య సేవ నేత్రపర్వంగా సాగింది. ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల అర్చకత్వంలో మత్స్యావతార విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం తూర్పు రాజగోపురం ఎదుట ప్రత్యేక వేదికపై సేవ నిర్వహించారు.
ఫిబ్రవరి 21న హంస వాహన సేవ..
శుక్రవారం రాత్రి 7 గంటలకు స్వామివారిని స్వర్ణ శేషవాహనంపై ఊరేగించారు. నిత్య ఆరాధనలు ముగిసిన అనంతరం లక్ష్మీనారసింహులను ప్రత్యేకంగా అలంకరించి తిరువీధుల్లో తిప్పారు. ఆదిశేషుడిపై పవళించిన స్వామివారి రూపాన్ని భక్తులు దర్శించుకున్నారు. శేషవాహన విశిష్టతను అర్చకులు వివరించారు. నాలుగో రోజు శనివారం ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు వటపత్రశాయిగా, రాత్రి 7 గంటలకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
