
- వేములవాడ తిప్పాపూర్ లో కూల్చివేత పనులు పరిశీలించిన కలెక్టర్
- అడ్డకున్న బాధితులు, పోలీసుల సాయంతో కూల్చివేతలు
వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణంలో రెండో బ్రిడ్జి నిర్మాణం కోసం భూ సేకరణ పనులను అధికారులు వేగవంతం వేశారు. తిప్పాపురం బస్టాండ్ ఎదురుగా ఉన్న పలు ఇళ్లు, దుకాణాలను సోమవారం అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. 15 రోజుల క్రితమే నోటీసులు జారీ చేయగా గడువు ముగియడంతో కూల్చివేతలు చేపట్టారు. నష్టపరిహారం ఇవ్వకుండానే ఇళ్లను కూల్చుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం కూల్చివేతలకు ముందే కోర్టులో జమ చేసినట్లు ఆర్డీఓ రాధాబాయి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తెలిపారు.
30 నిర్మాణాలను జేసీబీల సహాయంతో తొలగించారు. బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు పక్కకి తీసుకెళ్లారు. తిప్పాపూర్‌లో నిర్మాణాల కూల్చివేత పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిహారం ఇవ్వకుండానే ఇళ్లను ఎలా కూల్చివేస్తారని బీజేపీ రాష్ర్ట నాయకుడు ప్రతాప రామకృష్ణ అధికారులపై మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.
రాజన్న గోశాలను తనిఖీ చేసిన కలెక్టర్
తిప్పాపూర్ లోని గోశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోడెల ఆవరణను పరిశీలించి, నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సిబ్బందికి డ్రెస్ కోడ్ వారి పేర్లతో ఉండాలని సూచించారు. అనంతరం తిప్పాపూర్ లోని ప్రైమరీ స్కూల్ ను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్లు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. తహసీల్దార్లు పాల్గొన్నారు.