వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత చట్టవిరుద్ధం :  డాక్టర్ భీంరావు యశ్వంత్ అంబేద్కర్

వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత చట్టవిరుద్ధం :  డాక్టర్ భీంరావు యశ్వంత్ అంబేద్కర్

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల సర్వే నంబర్లు 147, 148, 149లోని భూదాన్ భూముల్లో నివసిస్తున్న నిరుపేదల ఇండ్లను కూల్చివేయడం చట్టవిరుద్ధమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు డాక్టర్ భీంరావు యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. ప్రభుత్వం భూ నిర్వాసితులకు న్యాయం చేయకపోతే రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి చేపడతామని హెచ్చరించారు. శనివారం కేతవరపు కృష్ణారావు అధ్యక్షతన భూదాన్ బాధితులతో కలిసి ఖమ్మం ఓల్డ్ బస్టాండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం జరిగిన సభలో భీంరావు యశ్వంత్ అంబేద్కర్ మాట్లాడుతూ 15 ఏండ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను కూల్చడం అమానుషమన్నారు. మిగిలిన బాధితులందరికీ వెలుగుమట్లలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ భూదాన్ భూముల వ్యవహారంపై నిజనిర్ధారణ కమిటీ పరిశీలించిందని, బాధితులకు న్యాయం జరిగే వరకు న్యాయపరంగా పోరాడుతామని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ బాధితుల పోరాటంతో 311 ఇండ్లు మంజూరయ్యాయని, మిగిలిన వారికి కూడా వెంటనే ఇళ్లు ఇవ్వాలని కోరారు. అనంతరం భూదాన్ భూములను నాయకుల బృందం పరిశీలించింది. కార్యక్రమంలో పలువురు నాయకులు, న్యాయవాదులు, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు