- ఈ ఏడాదిలో 20 బిలియన్ డాలర్లు
- 576 డీల్స్ పూర్తి
- చైనా విధానాలు నచ్చక ఇండియాకు వస్తున్న ఇన్వెస్టర్లు
- అమెరికాలో వడ్డీలు తక్కువ ఉండటం మరో కారణం
‘‘ఇండియన్ స్టార్టప్‌లకు భారీగా ఫండ్స్ రావడం సర్వసాధారణం గా మారింది. గతంలో చైనా, అమెరికాకు విపరీతంగా ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చేవి. ఇండియాకు తక్కువగా వచ్చేవి. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు మనదేశంలో డేటా చాలా చీప్. ఆన్‌లైన్ షాపింగ్ కస్టమర్లు కోట్లలో ఉన్నారు. డిజిటల్ అడాప్షన్ పెరిగింది. ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్లను ఎంకరేజ్ చేస్తున్నది. ఒకప్పుడు మన కంపెనీల నెల ఆదాయం రూ.20 లక్షలు దాటేది కాదు. ఇప్పుడు రూ.మూడు కోట్ల వరకు వస్తున్నాయి. అందుకే ఇన్వెస్ట్‌మెంట్లు భారీగా ఉన్నాయి ’’
‑ మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా ఎండీ తరుణ్ దావ్డా
న్యూఢిల్లీ: మనదేశ స్టార్టప్‌లకు విదేశీ నిధులు వరదలా వస్తున్నాయి. ప్రతి ఏటా ఫండింగ్ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఏకంగా రికార్డుస్థాయిలో 20 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.1.47 లక్షల కోట్లు) ఫండింగ్ అందింది. విదేశీ కంపెనీలకు ఇండియా పెట్టుబడుల కేంద్రంగా మారింది. -అమెరికాలో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండటం, ఆన్‌లైన్ మార్కెట్ల దూకుడు, స్టార్టప్‌లు స్టాక్‌మార్కెట్లలో లిస్ట్ కావడం, టెక్ కంపెనీలపై చైనా కఠినంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలు. అన్ని కంపెనీలూ డిజిటల్ కు మారడం కూడా స్టార్టప్‌ల ఎదుగుదలకు మరో కారణం. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం, 2019 లో 878 డీల్స్ నుండి 13 బిలియన్ల డాలర్లు రాగా, ఈ ఏడాది 576 డీల్స్ ద్వారా కంపెనీలు 20.2 బిలియన్ల డాలర్లను సేకరించాయి. యావరేజ్ డీల్ సైజు 35 మిలియన్ డాలర్లు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ విలువ 2021లో రెట్టింపు అయింది. మాన్యుఫ్యాక్చరింగ్ స్టార్టప్ జెట్‌వర్క్ 1.4 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ వద్ద 20 మిలియన్ల డాలర్లను సేకరించింది. బైజు, ఎరుడిటస్, ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో స్విగ్గీ, పేమెంట్స్ కంపెనీ పైన్ ల్యాబ్స్ లకు భారీగా డబ్బులు వచ్చాయి. ఇవి 3.8 బిలియన్ డాలర్లు సేకరించాయి. మార్కెట్ లీడింగ్ స్టార్టప్‌లు గతంలో ఎన్నడూ ఇంత భారీగా ఫండింగ్‌ను సాధించలేదు. జొమాటో లిస్టింగ్ సక్సెస్ కావడంతో స్టార్టప్‌లపై నమ్మకం మరింత పెరిగింది. నైకా, పాలసీబజార్, పేటిఎమ్ వంటి మరిన్ని స్టార్టప్‌లు లిస్టింగ్ కోసం రెడీ అవుతున్నాయి. ఇది వరకే వీటికి భారీగా విదేశీ పెట్టగబడులు వచ్చాయి. అయితే అన్ని స్టార్టప్‌లకూ ఫండ్స్ రావడం లేదు. తగిన అండదండలు, అనుభవం, ఎదుగుదల సామర్థ్యం ఉన్న వాటిలోనే డబ్బు పెడుతున్నారని ఎనలిస్టులు అంటున్నారు.
