
- మరణాల సంఖ్య జీరోగా చూపిస్తున్న సర్కార్
- కేరళలో అత్యధికంగా 9,707 కేసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. వేల మంది దవాఖాన్లలో చికిత్స పొందుతున్నారు. వైరల్ ఫీవర్లతో లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రోజు ఏదో చోట జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పో తున్నారు. రాష్ట్ర సర్కార్ మాత్రం డెంగ్యూ కేసుల సంఖ్యను చాలా తక్కువగా చూపుతున్నది. ఇక మారణాలైతే అసలే లేవని బుకాయిస్తున్నది. ఆయా రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా సెప్టెంబర్ 17వ తేదీ నాటికి దేశంలో 94,198 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, 91 మంది డెంగ్యూతో మరణించారని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అత్యధికంగా కేరళలో 9,770 కేసులు, 37 మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. ఈ లిస్టులో 5,138 కేసులతో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. ఈ నెల రోజుల్లో సుమారు 3 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈ సంఖ్య 8,054కు పెరిగింది. అయితే అనధికారికంగా కేసుల సంఖ్య దీనికి పదింతలు ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. వైరల్ ఫీవర్ల నియంత్రణకు ప్రతి జిల్లాలోనూ హెల్త్ క్యాంపులు పెడుతున్నామని, జిల్లాకో టోల్‌ఫ్రీ సెంటర్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.
మృతులే లేరట
రాష్ట్రంలో డెంగ్యూతో ఒక్కరు కూడా చనిపోలేదని, రాష్ట్ర ఆరోగ్యశాఖ కేంద్రానికి ఇచ్చిన రిపోర్ట్‌లో పేర్కొంది. డెంగ్యూతో ములుగు జిల్లాలో నలుగురు చనిపోయినట్టు గత నెల 13న ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. అప్పటికే పదుల సంఖ్యలో మరణాలు నమోదైనా, ఈ నాలుగింటిని మాత్రం అధికారికంగా ప్రకటించారు. కేంద్రానికి ఇచ్చిన రిపోర్ట్‌లో ఈ 4 డెత్స్‌ను కూడా దాచేశారు. ఇలా మరణాలను దాచి అబద్ధాలు చెప్పడం వల్ల డెంగ్యూ నిర్మూలన సాధ్యం కాదు అని, డెంగ్యూ నిర్మూలన కోసం కృషి చేస్తున్న డాక్టర్ కరుణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజాలు చెబుతూ, జనాల్లో అవగాహన పెంచితేనే మరణాలు ఆపగలుగుతామని ఆమె పేర్కొన్నారు.
300 దాటిన మలేరియా కేసులు
దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ముందే, తెలంగాణలో మలేరియాను నిర్మూలిస్తామని ఐదేండ్ల కిందటే రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. కానీ, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలం అయింది. ఈ ఏడాది ఇప్పటికే 337 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 158 కేసులు కొత్తగూడెం జిల్లాలో, ఆసిఫాబాద్‌లో 75, ములుగులో 38 కేసులు, హనుమకొండలో 13, హైదరాబాద్‌లో 8 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా, అందులో 24 జిల్లాల్లో మలేరియా కేసులు నమోదవడం గమనార్హం.