గ్రేటర్​లో డెంగీ పంజా

గ్రేటర్​లో డెంగీ పంజా

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో డెంగీ పంజా విసురుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో జనవరి నుంచి ఇప్పటివరకు మూడు వేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ఈసారి బస్తీల్లో కంటే కాలనీల్లోనే ఎక్కువ కేసులు ఉంటున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్​వంటి ప్రాంతాల్లో అత్యధికంగా డెంగీ బారిన పడ్డారు. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త, ఇండ్లల్లోని పూల కుండీల్లో నిలిచిన నీటిలో దోమలు ఉత్పత్తి పెరగడమే ఈ ఏరియాల్లో డెంగీ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. గత నెలలో అత్యధికంగా 1,500 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ నెలలో ఇప్పటివరకు 400కు పైగా నమోదయ్యాయి. ఈ ఏడాది మొదట్నుంచి నుంచి ఇప్పటివరకు మొత్తంగా జూబ్లీహిల్స్​సర్కిల్ లో 154, ఖైరతాబాద్​పరిధిలో 151 డెంగీ కేసులు నమోదయ్యాయి. డివిజన్ల వారీగా చూసినా అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 64, బంజారాహిల్స్ లో 59, అమీర్ పేటలో 49 కేసులు నమోదయ్యాయి. ఇటీవల జరిగిన బల్దియా కౌన్సిల్ మీటింగులో స్వయంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుందని అసహనం వ్యక్తం చేయడం సిటీలోని పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు దోమల నివారణకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. 

అన్నిచోట్ల అధికమయ్యాయ్

గ్రేటర్​లోని అన్ని ప్రాంతాల్లో దోమలు అధికమయ్యాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు జనం అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే 250 ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించగా, ఈ  ప్రాంతాల్లోనే ఎక్కువగా డెంగీ కేసులు నమెదవుతున్నాయి. 33,500 బ్రీడింగ్ పాయింట్లు ఉన్నట్లుగా గుర్తించి, దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ కొన్నిచోట్ల మినహా పెద్దగా కనిపించడంలేదు. ప్రస్తుతం హాస్పిటళ్లకు వస్తున్న వారిలో సీజనల్​వ్యాధులతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో డెంగీ పేషెంట్లు ఉన్నారు. ప్రైవేట్, కార్పొరేట్​హాస్పిటళ్లలో నమోదవుతున్న డెంగీ కేసుల వివరాలు జిల్లా వైద్యాధికారులు వద్ద ఉంటున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారుల వద్ద ఉండడం లేదు.

6,510 శాంపిల్స్.. 362 పాజిటివ్

ఇటీవల హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులు ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రేటర్ లో 10 వేల మందికిపైగా టెస్టులు చేయగా, 500కుపైగా డెంగీ పాజిటివ్ అని తేలింది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 6,510 సీరం శాంపిల్స్ తీయగా 362 మందికి డెంగీ పాజిటివ్​వచ్చింది. దీన్ని బట్టి సిటీలో డెంగీ విజృంభణ ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు.