టికెట్ ఇస్తలేరని టవరెక్కిండు

టికెట్ ఇస్తలేరని టవరెక్కిండు
  • టికెట్ ఇస్తలేరని టవరెక్కిండు
  • ఢిల్లీ ఆప్ మాజీ కౌన్సిలర్ నిరసన

న్యూఢిల్లీ: మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వట్లేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ హసీబ్-ఉల్ హసన్ ఆదివారం ఓ సెల్ టవర్ ఎక్కారు. తనకు చెందిన పత్రాలు ఆప్ నేతలు అతిషి, దుర్గేశ్​ పాఠక్ దగ్గర ఉన్నాయని, అడిగితే ఇవ్వట్లేదని ఆరోపించారు. తన బ్యాంక్​ పాస్​ బుక్​తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్లు వాళ్ల దగ్గరే ఉన్నాయన్నారు. టవర్ మీదికి ఎక్కిన హసన్.. తాను ఎంత ఎత్తులో ఉన్నాడో ఫేస్​బుక్​ లైవ్​లో చూపించారు. ఇక్కడ్నుంచి పడి చనిపోతే దుర్గేశ్, అతిషి బాధ్యత వహిస్తారని చెప్పారు. ‘‘నా ఒరిజినల్ పత్రాలు వాళ్లిద్దరి దగ్గరే ఉన్నాయి.

నామినేషన్లు దాఖలు చేసేందుకు సోమవారం ఆఖరు తేదీ. కానీ, వాళ్లు డాక్యుమెంట్లు ఇస్తలేరు”అని హసన్ చెప్పారు. టికెట్ ఇస్తారో లేదో తర్వాత.. ముందు తన పత్రాలు మాత్రం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఆయన టవరెక్కిన సంగతి తెలిసి పోలీసులు, ఫైర్ సిబ్బంది స్పాట్​కు చేరుకున్నారు. పోలీసులు అభ్యర్థించడంతో హసన్ కిందకు దిగారు. కాగా, డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​లో 250 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం తొలి జాబితాను, 117 మంది అభ్యర్థులతో శనివారం రెండో జాబితాను ఆప్ రిలీజ్ చేసింది. ఇందులో చాన్స్ దక్కని మాజీ కౌన్సిలర్లు నిరసన తెలియజేస్తున్నారు.