- గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు
- ట్రంప్‌కు డెన్మార్క్ పీఎం మెట్టే ఫ్రెడరిక్‌సెన్ కౌంటర్
- అమెరికా అధ్యక్షుడి కామెంట్లను ఖండించిన గ్రీన్‌లాండ్ ప్రధాని
- సోషల్ మీడియా పోస్టులతో తమ భవిష్యత్తు నిర్ణయించలేరని కామెంట్
డెన్మార్క్: గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లపై డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాయి. ‘‘మీ బెదిరింపులు ఆపండి.. గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు’’అని డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్‌సెన్ స్పష్టం చేశారు. ‘‘మాకు గ్రీన్‌లాండ్ కచ్చితంగా కావాలి. జాతీయ భద్రత కోసం అది అవసరం’’అని ఇటీవల ది అట్లాంటిక్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు.
ట్రంప్ బెదిరింపులపై డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్‌సెన్ ధీటుగా స్పందించారు. ‘‘గ్రీన్‌లాండ్ ప్రజలు అమ్మకానికి లేరు. ఒక మిత్రదేశం పట్ల ఇలాంటి బెదిరింపులు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించడం పూర్తిగా అర్థరహితం. డానిష్ రాజ్యంలోని 3 దేశాల్లో దేన్ని కూడా ఆక్రమించుకునే హక్కు అమెరికాకు లేదు. డెన్మార్క్ నాటో దేశం. గ్రీన్‌లాండ్ కూడా నాటో రక్షణ కిందికి వస్తుంది. అమెరికాతో ఇప్పటికే రక్షణ ఒప్పందం ఉంది’’అని మెట్టే ఫ్రెడరిక్‌సెన్ గుర్తు చేశారు.
గ్రీన్‌లాండ్ మా సొంతిల్లు: ప్రధాని ఫ్రెడెరిక్ నీల్సన్
ట్రంప్ బెదిరింపులపై గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్-ఫ్రెడెరిక్ నీల్సన్ కూడా స్పందించారు. ‘‘గ్రీన్‌లాండ్ మా సొంత ఇల్లు, మా భూభాగం. దీనిని అమెరికాకు అప్పగించే ప్రసక్తే లేదు’’అని ఫేస్‌బుక్ ద్వారా స్పష్టం చేశారు. వెనెజువెలా మాదిరి గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకుంటామంటూ ట్రంప్ చేసిన కామెంట్లను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
తమ భవిష్యత్తును సోషల్ మీడియా పోస్టులతో నిర్ణయిస్తామంటే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. కాగా, డెన్మార్క్ ప్రభుత్వం ఈ అంశంపై అమెరికా రాయబారిని పిలిపించి సంజాయిషీ కోరింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశ సార్వభౌమత్వాన్ని డబ్బుతో కొనడం సాధ్యం కాదని నిపుణులు చెప్తున్నారు.
కాగా, గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో భాగంచేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి ట్రంప్, లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని ప్రత్యేక దూతగా నియమించారు. ఇది డెన్మార్క్‌ను మరింత ఆగ్రహానికి గురిచేసింది.
