జ్ఞానదంతం తొలగిస్తే.. ఏం కాదా?

జ్ఞానదంతం తొలగిస్తే.. ఏం కాదా?

మా పాప వయసు పది సంవత్సరాలు. వెనక దవడ పళ్లు వస్తున్నప్పుడు అక్కడ చిగురు వాచినట్టుగా అయ్యింది.  తినేటప్పుడు ఇబ్బంది పడుతోంది. దీనికి కారణాలు ఏంటి? ట్రీట్‌‌మెంట్ చేయించాలా?

పాల పళ్లు ఊడి, పర్మినెంట్ పళ్లు వచ్చేటప్పుడు చిగురు ఎర్రగా కనిపిస్తుంది. అయితే, పాల పళ్లు ఊడుతున్నప్పుడు అక్కడ సరిగ్గా బ్రష్‌‌ కాకపోవడం వల్ల  చిగురు వాపు వస్తుంది.  కింద పన్ను బయటకు వస్తుందా? లేదా? అని తెలుసుకోవాలంటే  ఎక్స్‌‌ రే తీసి నిర్థారించుకోవాలి. అది చక్కగానే వస్తున్నట్టయితే.. ఈ చిగుర్ల మీద లిగ్నోకెయిన్‌‌ ఆయింట్‌‌మెంట్‌‌గానీ, బెంజోకెయిన్‌‌ ఆయింట్‌‌మెంట్‌‌గానీ తినేముందు పూస్తే.. నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాకాకుండా ఒకవేళ చిగురు గట్టిపడి, పన్ను బయటకు రాలేకపోతే  దానికి ‘ఒపర్‌‌‌‌ క్లక్‌‌’ అనే ఒక చిన్న పద్ధతి ద్వారా క్లియర్‌‌‌‌ చేయొచ్చు. లోపల ఉన్న పన్ను తీరుని బట్టి చికిత్సని ఎంచుకోవాలి. పన్ను బయటకు వచ్చిన తర్వాత చిగురు మీద ఆహారం ఒత్తిడి పడదు కాబట్టి.. నొప్పి తగ్గిపోతుంది.

నాకు పందొమ్మిది సంవత్సరాలు. దవడ చివర వాచినట్లు అనిపిస్తోంది. నోరు తెరవడానికి కూడా కష్టంగా ఉంది. తింటున్నప్పుడు కూడా వాచిన చిగురు దగ్గర నొప్పి పుడుతోంది. ఏ ట్రీట్‌‌మెంట్ తీసుకోవాలి?

సాధారణంగా పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యలో జ్ఞాన దంతాలు బయటకు రావడం స్టార్టవుతుంది.  ఇవి బయటకు వచ్చేటప్పుడు చిగురు లోపల ఇరుక్కున్నప్పుడు వంకరగా వస్తుంటాయి. ఒక్కోసారి సగం మాత్రమే వచ్చి ఆగిపోతాయి. ఈ పళ్లను ‘ఇంపాక్టెడ్’ టీత్‌‌ అంటారు. ఇలా వంకర తిరిగిన, ఇరుక్కున్న పళ్ల దగ్గర ఆహారం చేరినప్పుడు చిగురు వాస్తుంది. ఇదే దవడ దగ్గర నొప్పికి కారణమవుతుంది. మందులు తీసుకున్నప్పుడు ఈ నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ, అది తాత్కాలికమే. ఇలాంటప్పుడు చిగురుని తొలగించాల్సి వస్తుంది.

పన్ను పొజిషన్ వంకరగా ఉండి ముందు పన్నుపై ఒత్తిడి పడినప్పుడు జ్ఞాన దంతాన్ని తొలగించాలి. తొలగించిన తర్వాత కృత్రిమ పళ్లు పెట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. స్కాన్, ఎక్స్‌‌రే లో జ్ఞాన దంతాల పొజిషన్ తెలుసుకుని..  డాక్టర్లు  జ్ఞాన దంతాల్ని తొలగిస్తారు లేదా పన్ను చక్కగా ఉంటే, చిగురిని తొలగించి దానికి ఒక దారిని క్రియేట్ చేస్తారు.

జ్ఞాన దంతం, చిగురు మధ్య ఆహారం ఇరుక్కుంటోంది. దీని వల్ల పన్ను పుచ్చిపోయే ప్రమాదం ఉందా?

జ్ఞాన దంతం అనే కాదు.. పన్నుకు, చిగురుకి మధ్య ఎక్కడా ఆహారం నిల్వ ఉండకూడదు. జ్ఞాన దంతానికి, దాని ముందు పన్నుకు మధ్య ఆహారం ఉన్నప్పుడు జ్ఞానదంతంతో పాటు అదీ పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఆ పుచ్చు లోపలి నుంచి మొదలవుతుంది కాబట్టి, కంటికి కనిపించదు. నొప్పి వచ్చినప్పుడు మాత్రమే   సమస్య తెలుస్తుంది. నొప్పి రాగానే.. దంత వైద్యుడిని కలవాలి.

నా నోరు పొడిబారినట్టు అనిపిస్తుంటుంది. తినేటప్పుడు తేలికగా మింగలేకపోతున్నాను. మాట్లాడేటప్పుడు నాలుక పొడిగా ఉండటం వల్ల, మాటలు కూడా స్పష్టంగా రావడం లేదు. దీనికి పరిష్కారం ఏంటి?

నోరు పొడిబారడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్‌‌ వల్ల, కొన్ని రకాల మందులు వాడటం, నోటితో గాలి పీల్చుకోవడం,  కొన్ని రకాల సిండ్రోమ్స్, క్యాన్సర్ ట్రీట్‌‌మెంట్ తర్వాత వచ్చే సైడ్‌‌ ఎఫెక్ట్స్‌‌ వల్ల నోరు  ఆరిపోయి పొడిబారుతుంది. ఈ సమయంలో  లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు తింటున్న ఆహారం పళ్ల చుట్టూ చేరి వెంటనే గట్టిపడటం, పళ్లకి, చిగురికి మధ్య చేరిపోతుంది. అది పళ్ల మీద చాలా కాలం అతుక్కొని ఉంటుంది.  దీని వల్ల చిగురు వ్యాధులు రావడంతో పాటు పిప్పి పళ్లు కూడా తొందరగా వస్తుంటాయి. నోరు పొడిబారడానికి కారణం తెలుసుకొని చికిత్స తీసుకోవాలి. అయితే, నోరు పొడిబారకుండా కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి.

నీళ్ల బాటిల్ దగ్గర పెట్టుకుని కొంచెం కొంచెం తాగుతూ ఎప్పుడూ  నోటిని తడుపుకుంటూ ఉండాలి. 

షుగర్‌‌‌‌ ఫ్రీ చూయింగ్‌‌ గమ్స్‌‌ని నమలడం వల్ల కూడా లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది.

స్మోకింగ్‌‌, ఆల్కహాల్‌‌కి దూరంగా ఉండడం వల్ల కూడా నోటి పొడిని తగ్గించుకోవచ్చు.

‘ఆర్టిఫీషియల్‌‌ సలైవరీ సబ్‌‌స్టిట్యూట్స్‌‌’ అని మెడికల్ షాప్‌‌లో దొరుకుతాయి. ఈ లిక్విడ్స్‌‌ నోట్లో పూసుకున్నప్పుడు నోరు తడిగా మారుతుంది. ఆరిపోయినా పట్టించుకోకపోవడం వల్ల నోరు పగలడం, కారం తిన్నప్పుడు మండటం,  మాటల్లో స్పష్టత లేకపోవడం, తినేటప్పుడు మింగలేకపోవడం వంటివి జరుగుతాయి.

గత కొద్ది నెలలుగా నా నోరు తిరగడం లేదు. దవడలు నొప్పిగా ఉన్నాయి ఎందుకు?

నోటిలో ఇన్ఫెక్షన్స్ లేదా దురలవాట్ల వల్ల కండరాలు  అన్నీ గట్టిగా బిగుసుకు పోతాయి. దీన్నే  ‘ఓరల్‌‌ సబ్‌‌ న్యూకోస్‌‌ ఫైబ్రోసిస్‌‌’ అంటారు. ఈ సమస్యలు ఉన్నప్పుడు నోరు తెరిచేందుకు ఇబ్బంది పడుతుంటారు.  కింది దవడ, పై దవడ అతుక్కొని ఉన్న జంక్షన్‌‌ దగ్గర ఉండే జాయింట్ల వద్ద వచ్చిన మార్పుల వల్ల కూడా ఒక్కోసారి నోరు తెరవలేకపోతారు.  ఇవన్నీ చెక్‌‌ చేసుకున్న తర్వాత ట్రీట్‌‌మెంట్ తీసుకోవాలి.

కొంతమంది నిద్రలో పళ్లు కొరకడం, పళ్ల అరుగుదల,   తినేటప్పుడు పళ్లు వంకర టింకరగా మ్యాచ్‌‌ కావడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి జాయింట్ల  దగ్గర ఇన్ఫెక్షన్స్, జాయింట్లు అరిగిపోయి బోన్‌‌ చేంజెస్‌‌ రావడం వల్ల దవడని కదిలించలేక ఇబ్బంది పడతారు.

-డాక్టర్‌ వైఎస్‌ రెడ్డి
ఇండియన్‌ డెంటల్‌‌ అసోసియేషన్‌
ప్రెసిడెంట్‌ , డె క్కన్ బ్రాంచ్‌