అదృష్టవంతులు.. కొందరు జస్ట్ 4 గంటలు నిద్రపోయినా.. యాక్టివ్గా ఎలా ఉంటున్నారంటే..

అదృష్టవంతులు.. కొందరు జస్ట్ 4 గంటలు నిద్రపోయినా.. యాక్టివ్గా ఎలా ఉంటున్నారంటే..

‘‘ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు’’ అనే సామెత వినే ఉంటారు. బాగా అలిసిపోయినప్పుడు కటికనేల మీద పడుకున్నా మంచిగా నిద్ర పడుతుంది అనే భావంలో పెద్దలు ఈ సామెత వాడేవారు. కానీ.. ప్రస్తుతం ఈ ఉరుకులుపరుగుల బిజీ జీవితంలో అలసిసొలసిపోయినా నిద్ర పట్టక సతమతమవుతున్నోళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మంచి నిద్ర పట్టక కిందామీదా అయ్యే వాళ్లు ఈరోజుల్లో ఇంటింటికీ ఉన్నారు. అయితే.. ఇలాంటోళ్ల మధ్య  తక్కువ నిద్రపోయినా మేనేజ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్లూ ఉన్నారు.

24 గంటల్లో జస్ట్ 4 గంటలు నిద్రపోయి మేనేజ్ చేస్తున్న అదృష్టవంతులు కూడా ఉన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్ర పోవాలని వైద్యులు చెబుతుంటారు. కానీ.. కొందరు 4 గంటలు నిద్రపోయినా రోజంతా యాక్టివ్గా ఉంటుంటారు. అదెలా సాధ్యం అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. అరుదైన జెనెటిక్ మ్యూటేషన్ కారణంగానే కొందరు తక్కువ నిద్రపోయినా యాక్టివ్గా ఉంటారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది.

SIK3-N783Y Mutation అని ఈ జన్యు పరివర్తనకు శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ మ్యూటేషన్ జరిగే వ్యక్తులు రోజుకు 4 నుంచి 6 గంటలు నిద్రపోయినా సరిపోతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వీళ్లను హ్యుమన్ సూపర్ స్లీపర్స్ అని కూడా పిలుస్తున్నారు. మనం నిద్రపోయినప్పటికీ మన శరీరం తన పని తను చేస్తూనే ఉంటుంది. ఈ మ్యూటేషన్ జరిగే వాళ్లలో ఇతరులతో పోల్చుకుంటే నిద్రపోతున్న సమయంలో  శరీరంలో జరిగే ప్రక్రియలు వేగంగా జరుగుతాయని అధ్యయనంలో తేలింది. ఇలాంటి వాళ్లు 4 గంటలు నిద్రపోయినా నిద్రలేమి సమస్య లేకపోవడానికి కారణం ఇదేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే సిటీల్లోనే నిద్రలేమి సమస్య బాధితులు పెరుగుతున్నారు. వర్క్ ఫ్రం హోం, పనిచేసే టైం పెరగడం, వివిధ పనుల కారణంగా నిద్రను వాయిదా వేయడమే ఇందుకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. గతంతో పోలిస్తే నిద్రలేమితో బాధపడుతున్న వారు15 నుంచి 20 శాతం పెరిగారని అంటున్నారు. వీరిలో ఎక్కువ శాతం 20 నుంచి 40 ఏండ్ల లోపువారు ఉన్నారు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్లో అధిక శాతం మంది నిద్రను వాయిదా వేస్తున్నారని తేలింది.