
నెల్లూరు: దుస్తులపై ఆఫర్లు ప్రకటిస్తే అవసరం లేకపోయినా ఆఫర్ ప్రకటించారని కొనే జనానికి మన దేశంలో కొదవే లేదు. కొత్తగా బట్టల షాప్ ఓపెన్ చేస్తే ప్రారంభ ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. 10 రూపాయలకే చీర అని, 50 రూపాయలకే షర్ట్ అని, 100 రూపాయలకే బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్ అని కొత్తగా క్లాత్ షోరూం పెట్టే ఓనర్లు విపరీతాలకు పోతుంటారు. ఒకరిద్దరికి ఇచ్చి.. మిగిలిన వాళ్లకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అని చెప్పి చేతులు దులుపేసుకుంటారు. ఏపీలోని నెల్లూరులో ఈ తరహా ఘటనే జరిగింది.
రెండు రూపాయలకే టీ షర్ట్, రూపాయికే బట్టలు అని ఫుల్ పబ్లిసిటీ చేశారు. సోషల్ మీడియాలో బీభత్సంగా ప్రచారం చేశారు. దీంతో.. నెల్లూరు సిటీలో జనం ఆ కొత్తగా పెట్టిన బట్టల షాప్ ముందు క్యూ కట్టారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. ఆ షాప్ ఓనర్లు షెట్టర్ దించేశారు. షాప్ ఓపెనే చేయలేదు. అసలు బట్టలు ఒక్కరికి అయినా ఇచ్చారా అని కస్టమర్లు మండిపడ్డారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యాజమాన్యం అసత్య ప్రచారాలతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అసలేం జరిగిందంటే..
నెల్లూరు సిటీలోని నిప్పో సెంటర్ దగ్గర పుట్టవీధి మెయిర్ రోడ్లో RJR హెర్బల్ క్లినిక్ బిల్డింగ్ పైన ఆరోన్ గార్మెంట్ పేరుతో కొత్తగా ఒక బట్టల కొట్టు పెట్టారు. ప్రారంభ ఆఫర్ కింద.. రూపాయికే టీ షర్ట్, రెండు రూపాయలకు ప్యాంట్ అని ఇన్ స్టాగ్రాంలో, సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. అసత్య ప్రచారం చేయడంతో కృష్ణాష్టమి పండగ పూట జనం షాప్ ముందు పడిగాపులు కాశారు. ఆరోనా గార్మెంట్ దగ్గర జనాలు గుమిగూడారు. అక్కడ జనాలు పోగవడం చూసి ఆ దారిన వెళ్లే వాళ్లు ఏం జరిగిందోనని ఆగారు.
ఇలా.. ఫుల్ క్రౌడ్తో రోడ్డు నిండిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అంతమంది జనం వచ్చేసరికి నష్టపోతాడనే భయంతో ఇవ్వలేదో మరేదైనా కారణం ఉందో గానీ అలాంటి ఆఫర్ ఏం లేదని తేలిపోయింది. క్లాత్ షాప్ ఓనర్ ఫేక్ క్యాంపెయిన్ కారణంగా గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చిందని కొందరు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోగా, మరికొందరు మాత్రం బట్టల దుకాణం తెరుచుకుంటుందేమోనని ఆశగా అక్కడే ఎదురు చూస్తూ ఉండిపోయారు.