శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్: క్రియాయోగం గురించి భగవద్గీత ఏం చెబుతోంది.. పరమహంస యోగానంద మాటల్లో..

శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్: క్రియాయోగం గురించి భగవద్గీత ఏం చెబుతోంది.. పరమహంస యోగానంద మాటల్లో..

శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేసింది. గోపాలుడి అవతార క్షణాన్ని స్మరించుకుంటూ ఆలయాలు, ఇళ్లు మంగళధ్వనులతో, సుమధుర గీతాలతో మారుమోగుతున్నాయి. కృష్ణుని లీలలు, మహిమలపై భజనలతో భక్తులు ఉత్సవ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. భక్తులకు ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన అవతార విశేషాలను, ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం. 

లోక కల్యాణం కోసం శ్రీహరి 21 అవతారాలను ధరించాడు. అందులో పరిపూర్ణమైన అవతారం ఒకే ఒక్క శ్రీకృష్ణావతారం.  ‘‘ కృష్ణస్తు భగవాన్ స్వయం’’ .... అని శ్రీమద్భాగవతం 1.3.28 లో శ్రీకృష్ణుడే భగవంతుడు అని చెబుతుంది. మన జీవితాలను, సమస్త కర్మలను  దేవదేవుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు పునరంకితం చేయమని కృష్ణాష్టమి పర్వదినం మనకు గుర్తుచేస్తుంది. 

“ఎక్కడ కృష్ణభగవానుడు ఉంటే, అక్కడ విజయం ఉంటుంది!” భారతదేశంలో శతాబ్దాల తరబడి, ఒక తరం నుంచి ఇంకో  తరానికి వారసత్వంగా వస్తున్న ఈ అమర వాక్కులు, నిరంతరం మన మార్గంలో వచ్చే సవాళ్లను, పరీక్షలను ఎదుర్కొంటున్నా, మన మనస్సులను ఎల్లప్పుడూ భగవంతునిపైనే కేంద్రీకరించేలా మనకు ప్రేరణనిస్తాయి. 

 ప్రపంచ ప్రఖ్యాతమైన ఆధ్యాత్మిక గ్రంథం, ఒక యోగి ఆత్మకథ రచయిత శ్రీ శ్రీ పరమహంస యోగానంద, భగవద్గీతపై ‘గాడ్ టాక్స్ విత్ అర్జున’ అనే రెండు సంపుటాల గ్రంథాన్ని రచించారు. ఈ లోతైన ఆధ్యాత్మిక  పుస్తుక పరిచయంలో... “భగవంతుని కోసం జరిగే అన్వేషణలో భక్తుడు, సాధకుడు ఎక్కడ ఉన్నప్పటికీ, వారి ప్రయాణంలో ఆ భాగం పై  భగవద్గీత తన కాంతిని ప్రసరింపచేస్తుంది.”  అని చెబుతారు యోగానంద.

యోగానంద చెప్పిన గీత వ్యాఖ్యానంలో  భగవంతుడి అంతర్గత సందేశాన్ని  మరింత విశదీకరిస్తూ : కురుక్షేత్ర యుద్ధం.... యుద్ధానికి ముందు అర్జునుడి నైరాశ్యం .....  ఇందులో నిజమైన అంతరార్ధం ఏమంటే, ప్రతి మనిషీ తన కోరికలను, అలవాట్లను వదలుకోవడానికి చూపే అయిష్టతను , అంతిమంగా ఆత్మ విముక్తి కోసం జరిగే ధర్మయుద్ధంలో  ముందుగా ఈ అయిష్టతను జయించాలి. 

►ALSO READ | Krishna Janmashtami 2025 : ఇంట్లో నుంచే బృందావన్, మధుర, ద్వారకలో కృష్ణుడి పుట్టిన రోజు వేడుకలు చూడొచ్చు.

భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు  ఎన్నో విశేషాలను, అతి సూక్ష్మమైన యోగ రహస్యాలను అలతి అలతి పదాలలో తేలికగా అర్ధం అయ్యేలా అర్జునుడికి దృఢంగా నొక్కి చెబుతాడు. “శరీరాన్ని నియంత్రించే తపస్సు చేసే వారికంటే, జ్ఞానమార్గాన్ని  అనుసరించే వారి కంటే, కర్మమార్గానువర్తుల కంటే, యోగి ఉత్తముడు. అందుకే అర్జునా, నీవు యోగివిగా మారు !” (గాడ్ టాల్క్స్ విత్ అర్జున: ద భగవద్ గీత VI:46). 

మానవాళికి అత్యున్నత ఆధ్యాత్మిక విజ్ఞానమైన 'క్రియాయోగం' గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో రెండుసార్లు ప్రస్తావించాడు. క్రియాయోగం పరమహంస యోగానంద గారి బోధనల సారభూతం. పరమహంస యోగానందగారిచే స్థాపించబడిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.), ముద్రిత, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ మహాగురువుల బోధనలను ప్రచారం చేస్తుంది. వై.ఎస్.ఎస్.  'జీవించడం ఎలా' బోధనలు ఈ బృహత్కార్యంలో ఒక ముఖ్యమైన భాగం.

 'క్రియాయోగం' అనే శాస్త్రీయ మార్గాన్ని అనుసరించడం ద్వారా, ఏ కాలానికి, జాతీయతకు, నేపథ్యానికి చెందిన సత్యాన్వేషకులైనా ఆధ్యాత్మిక విముక్తి కోసం కృషి చేసి, అంతిమంగా దేవునితో ఐక్యత పొందవచ్చు.  అందువల్ల, భగవంతునితో ఏకత్వం కోసం మనం పరితపించాలని, మన జీవిత ప్రయాణాన్ని ఆ లక్ష్యం వైపు నడిపించాలని మనకు దృఢంగా గుర్తు చెయ్యడమే జన్మాష్టమి నిజమైన ప్రాముఖ్యత.  

మరింత సమాచారం కోసం: yssofindia.org