హైదరాబాద్లో ఇల్లు లేదా ల్యాండ్ కొనే ఆలోచనలో ఉన్న పబ్లిక్కు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

హైదరాబాద్లో ఇల్లు లేదా ల్యాండ్ కొనే ఆలోచనలో ఉన్న పబ్లిక్కు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
  • మీ పెట్టుబడులకు నాదీ భరోసా
  • మధ్య తరగతి నుంచి వచ్చిన.. అలానే ఆలోచిస్త
  • హైటెక్స్​క్రెడాయ్​ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్​
  • హైదరాబాద్ లో స్థిరాస్తి రంగానికి ఎన్నో అనుకూలతలు
  • ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌కు ప్రోత్సాహం, రక్షణ కల్పిస్తం
  • ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత పాటిస్తం
  • రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టే నిర్ణయాలు తీసుకోనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తాను ఒక మధ్యతరగతి మనిషిని అని, అలాగే ఆలోచిస్తానని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకతకు కట్టుబడి ఉంటానని, ప్రజల ఆస్తులను కొల్లగొట్టి విదేశాలకు తరలించే ఆలోచన తనకు లేదని  స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్‌‌లో అనేక అనుకూలతలు ఉన్నాయని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్‌‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను మధ్య తరగతి మనస్తత్వం ఉన్నవాడిని. పెట్టుబడిదారు ఆలోచనలు ఉన్నవాడిని కాదు. మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం, గౌరవం ఉంటాయి. ఉన్నంతలో సర్దుకుపోదాం, దుప్పటి ఉన్నంతనే కాళ్లు చాపుకుందాం అనే ఆలోచన ఉంటుంది’’ అని  వ్యాఖ్యానించారు. 

అందుకే కొంతమంది ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఆమోదించలేకపోవచ్చని, గతంలో పొందిన స్పెషల్ ప్రివిలేజ్‌‌‌‌ను ఇప్పుడు కొనసాగించలేకపోవచ్చని తెలిపారు. దీంతో సహజంగానే కొంతమందికి కోపం రావచ్చని, కానీ పారదర్శకమైన పాలన కోసం పాలసీలు చేయడంలో తనకు అభ్యంతరం లేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోనని తెలిపారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నప్పటికీ, వాటిని తొలగించి అభివృద్ధి వైపు ప్రయాణించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని  రేవంత్ రెడ్డి తెలిపారు. 

‘‘ప్రపంచ దేశాల అభివృద్ధికి రెండు కొలమానాలుంటాయి. అందులో ఒకటి పాలసీలు కాగా, రెండోది కన్‌‌‌‌స్ట్రక్షన్ రంగం లేదా బిల్డింగ్ అసెట్స్. ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వచ్చి, అభివృద్ధి వేగంగా పరిగెడుతుంది” అని పేర్కొన్నారు.  రాజకీయ నాయకులకు తమ సొంత ప్రయోజనాలు, ప్రాధాన్యతలు ఉంటాయని, తాను వాటిని తప్పు పట్టనని , కానీ కొంతమంది తమ స్వార్థం కోసం  సృష్టించే అపోహలను  నమ్మి మీరు వ్యాపింపజేస్తే అది చివరికి మీ వ్యాపారానికే నష్టం కలిగిస్తుంది  అని  తెలిపారు. రాష్ట్ర ప్రగతిని దృష్టిలో ఉంచుకొని పారదర్శకమైన విధానాలు తీసుకొస్తామని, పెట్టుబడులకు ప్రోత్సాహం, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వాలు మారినా పాలసీ పెరాలసిస్ ఉండదు
కులీ కుతుబ్ షా నుంచి మొదలుపెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వరకు పాలకులు మారినా పాలసీలు నిలిచిపోకుండా (పాలసీ పెరాలసిస్)  చూశారని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. అందుకే హైదరాబాద్​ నగరం ప్రపంచ దేశాలతో పోటీపడగలుగుతున్నదని చెప్పారు. ‘‘రాజకీయ నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ, ఒక రిచ్ కల్చర్‌‌‌‌ నుంచి వచ్చిన తెలంగాణ మాది. రాజకీయ విభేదాలను ప్రభుత్వ విధానాలతో పరిష్కరించుకోం. ఒకవేళ ఎవరికైనా నాతో వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే దాన్ని నేను స్వీకరిస్తాను. కానీ, నా రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోను. మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, మీ వ్యాపారాలు లాభాలు పొందేలా ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వానిది” అని పేర్కొన్నారు.

హైదరాబాద్ అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికలు
హైదరాబాద్‌‌‌‌ను మరింత అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం సుదీర్ఘ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నదని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి వివరించారు. ముఖ్యంగా, మెట్రో రైలు విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, గత పదేండ్ల నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన హైదరాబాద్‌‌‌‌ను మళ్లీ అగ్రస్థానానికి తీసుకువస్తామని తెలిపారు. నాగోల్ నుంచి ఎల్‌‌‌‌బీ నగర్, ఆపై చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టుకు మెట్రో మార్గాన్ని రీడిజైన్ చేశామని తెలిపారు. అలాగే, కూకట్‌‌‌‌పల్లి నుంచి పటాన్‌‌‌‌చెరు వరకు, హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రోను విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్యారడైజ్ నుంచి రాజీవ్ రహదారి, షామీర్‌‌‌‌పేట వైపు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌‌‌‌‌‌‌‌కు రక్షణ శాఖ నుంచి అనుమతులు సాధించామని తెలిపారు. ఇది కాకుండా, రాష్ట్రానికి రెండు అదనపు ఎయిర్‌‌‌‌పోర్టుల కోసం వరంగల్, ఆదిలాబాద్‌‌‌‌లో కేంద్రం నుంచి అనుమతులు తెచ్చామని అన్నారు. హైదరాబాద్‌‌‌‌ అభివృద్ధికి ‘విజన్ డాక్యుమెంట్ 2047’ సిద్ధం చేస్తున్నామని, ఇందులో రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించామని చెప్పారు. ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ లోపల సర్వీస్ సెక్టార్, ఓఆర్‌‌‌‌ఆర్ నుంచి ట్రిపుల్​ఆర్​ వరకు ఇండస్ట్రియల్ సెక్టార్,  ట్రిపుల్​ ఆర్​ ఆవల రూరల్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్‌‌‌‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రణాళికలన్నీ పారదర్శకంగా అమలు చేస్తూ భవిష్యత్తు తరాలకు గొప్ప నగరాన్ని అందిస్తామని  హామీ ఇచ్చారు.

కామన్‌‌‌‌సెన్సే నా ఆస్తి
పెద్ద చదువులు చదువుకోకపోయినా తనకు కామన్ సెన్స్ ఉందని, అదే తనకు అతిపెద్ద ఆస్తి అని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ కోసమేనని, తెలివితేటలకు, చిత్తశుద్ధికి దాంతో సంబంధం లేదని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి, పట్టుదల తనకు ఉన్నాయని తెలిపారు. ‘‘ప్రతిరోజు 18 గంటలు పనిచేసే ఓపిక ఉంది. మనందరం కలిసి ఈ నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం. రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్‌‌‌‌ను మీరు ఎంత పాజిటివ్‌‌‌‌గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది’’ అని అన్నారు. పెట్టుబడులకు భద్రతతోపాటు లాభాలు ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.