
- ఆగస్టు 15 నుంచి కొత్త బీమా ఇయర్ షురూ
- జూన్28 వరకు పాస్‌బుక్ వచ్చిన వారికి చాన్స్
- మొత్తం 3.22 లక్షల కొత్త పాస్‌బుక్కులు
- బీమా కోసం అప్లైకి ఈ నెల 5న ముగిసిన గడువు
- పాతవి, కొత్తవి కలిపి 47.87 లక్షల మందికి బీమా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2024–25 రైతు బీమా సంవత్సరం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నది. ఆగస్టు14 వరకు గత ఏడాది బీమా గడువు ముగియనున్నది. ఈ యేడు గత జూన్ 28 వరకు కొత్తగా 3.22 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినట్టు వ్యవసాయశాఖ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 75.86 లక్షల మంది పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉన్నారు.
వారిలో 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య వయసున్న రైతులు బీమా పథకానికి అర్హులు. కాగా, బీమా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఈ యేడు 2024–25 రైతు బీమా కోసం కొత్తగా లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో ఆగస్టు 9 వరకు అర్హులైన వారిని అధికారులు గుర్తించారు.
గణనీయంగా పెరిగిన రైతు బీమా అర్హులు
ఈ యేడు గత జూన్ 28వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన 3 లక్షల 22 వేల 582 మంది రైతులు బీమాకు అర్హులుగా ఉన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. అయితే, వారిలో 2 లక్షల 3 వేల 239 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. క్షేత్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులు, ఏఈవోలు, ఏఓలు, జిల్లాస్థాయిలో అధికారులు అప్లికేషన్లను పరిశీలించి, అందులో 2 లక్షల 3 వేల 210 మందిని అర్హులుగా గుర్తించారు.
మరో 29 మందిని రైతు బీమాకు అనర్హులుగా తేల్చారు. రాష్ట్రంలో గతంలో ఉన్న పట్టాదారుల్లో అర్హత ఉన్నా గతంలో 7 లక్షల 7 వేల 205 మంది రైతు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు. వారికి సైతం ఈ సారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వ్యవసాశాఖ అనుమతించింది. కాగా వీరిలో 72,278 మంది రైతులు ఈ యేడు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు.
అప్లికేషన్లు పరిశీలించిన అధికారులు 72,269 మందిని కొత్తగా రైతు బీమాకు అర్హులుగా తేల్చారు. కేవలం 8మందికి మాత్రమే అర్హత లేదని గుర్తించారు. ఈ యేడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు, గతంలో అర్హత ఉండి ఇప్పుడు అప్లై చేసుకున్న వారందరు కలిపి ఈ యేడు కొత్తగా 2 లక్షల 74 వేల 479 మంది రైతులు బీమాకు అర్హులుగా తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ యేడు రైతు బీమా అర్హుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
రెన్యువల్ డేటా పరిశీలన పూర్తి
బీమా కలిగిన రైతులకు సంబంధించిన రెన్యువల్ డేటా పరిశీలనను జులై 30నాటికే అధికారులు పూర్తిచేశారు. 60 ఏండ్లు నిండిన వారిని తొలగించి, మిగతా అర్హులైన 45.13 లక్షల మంది రైతులకు బీమాను రెన్యూవల్ చేయాలని అధికారులు నిర్ణయించారు. వీరి పూర్తి వివరాలను ఏఈవోలు రైతు బీమా పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. ఇలా పాత రెన్యువల్స్తోపాటు కొత్తగా అర్హులైన 2.74 లక్షల మందికి కలిపి ఈ యేడు మొత్తం 47.87 లక్షల మందికి రైతుబీమా చేయాల్సి ఉంటుంది.
గత ఏడాది ఎల్ఐసీకి ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున బీమా ప్రీమియం చెల్లించింది.ఈయేడు ప్రీమియం ఎంతనేది త్వరలో తేల్చనున్నారు. రైతు బీమా ఉన్న రైతులు సహజ మరణమైనా, ఏవిధంగా చనిపోయినా సదరు రైతు కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందుతుంది.