చెప్పకుండానే విద్యుత్ మీటర్ల మార్పు

చెప్పకుండానే విద్యుత్ మీటర్ల మార్పు
  • అధికారులు సమాచారం ఇవ్వడం లేదంటున్న వినియోగదారులు
  • బిల్లుల విషయంలో గందరగోళం
  • గ్రేటర్‌లో ఇప్పటి వరకు 15,615 కరెంట్ మీటర్ల మార్పు
  • బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వినియోగదారుల ఆందోళన
  • విద్యుత్​ సంస్థల సిబ్బంది ఇష్టారాజ్యం
  •  బిల్లు తీసే టైంలోనూ నిర్లక్ష్యం

రంగారెడ్డి,వెలుగు: సమాచారం లేకుండా మీటర్లను తరచూ మారుస్తూ విద్యుత్తు శాఖ అధికారులు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మీటర్ రీడింగ్ నిలిచిపోయినా, కాలిపోయినా వాటిని  మార్చాల్సిందేననే రూల్ ని విద్యుత్ అధికారులు పాటిస్తున్నారు. కానీ మీటర్ ని మార్చిన సంగతి వినియోగదారులకు చెప్పడం లేదు. కరెంట్ బిల్ ఇంటికి వచ్చిన తర్వాతే మీటర్‌ మార్చిన సంగతి వారికి తెలుస్తోంది. మీటర్ మార్చిన తర్వాత రెండు మూడు నెలల పాటు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తున్నట్టు వినియోగదారులు చెబుతున్నారు. దీనికి కారణం విద్యుత్ సిబ్బంది కరెంట్ మీటర్ రీడింగ్ కోసం తీసుకొచ్చే మెషీన్ లో కొత్త మీటర్ రీడింగ్ తీసుకోవడం లేదు. పాత మీటర్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఏ నెలలో ఎక్కువ యూనిట్లు వాడితే దాన్ని రీడింగ్ గా తీసుకుని మెషీన్ బిల్లు జనరేట్ చేస్తోంది. దీంతో కొత్త మీటర్ పెట్టిన తర్వాత ఎక్కువ యూనిట్లు వాడినట్టుగా బిల్లులు వస్తున్నట్టు అవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఎస్పీడీసీఎల్‌( సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) పరిధిలో 36,711 రీడింగ్‌ నిలిచిపోయిన, 6,904 కాలిపోయిన మీటర్లను అధికారులు గుర్తించారు. వీటిలో 6,904 రీడింగ్‌ నిలిచిపోయినవి, 1407 కాలిపోయిన మీటర్లను మార్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 9 సర్కిల్స్ లోనే ఉన్నాయి. గ్రేటర్ లో 17,169 రీడింగ్‌ నిలిచిపోయినవి, 2,019 కాలిపోయిన మీటర్లున్నాయి. ఇందులో 14,301 రీడింగ్‌ నిలిచిపోయిన, 1,314 కాలిపోయిన మీటర్లును మార్చినట్లు విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు.

ఈ ఏరియాల్లో ఎక్కువ

గ్రేటర్‌లోని హబ్సిగూడ, హైదరాబాద్‌ సెంట్రల్‌, మేడ్చల్‌, సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో అత్యధికంగా విద్యుత్‌ రీడింగ్ నిలిచిపోయిన మీటర్లున్నాయని అధికారులు గుర్తించి, మార్చేందుకు ప్రయాత్నం చేస్తున్నారు. మీటర్‌ రీడింగ్‌ కోసం వెళ్లిన అధికారులు నిలిచిపోయిన మీటర్లను మార్చనున్నారు. అయితే మీటర్‌ మార్చే సమయలో ఇంటి ఓనర్ కి  సమాచారం లేకుండానే బిగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గ్రేటర్‌లోని హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం లేకుండా కరెంట్ మీటర్లను మార్చడంతో బిల్లింగ్‌ విషయంలో సమస్యలోస్తున్నాయి. కొత్త  మీటర్‌ పెట్టిన తర్వాత మూడు నెలల వరకు ఎక్కువ బిల్లులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీటర్‌ మార్చిన సమయంలో ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం మీటర్‌ రన్నింగ్‌లో ఉన్నప్పుడు అత్యధికంగా వాడిన కరెంట్ రీడింగ్‌ ఆధారంగానే బిల్లులు వస్తాయి. దీంతో అత్యధికంగా ఏ నెలల్లో కరెంట్ వాడకం జరిగిందో ఆ నెల బిల్లు ఇస్తున్నారు. ఈ విషయం తెలియకపోవడంతో వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు బిల్లు ఇచ్చేటప్పుడు ఎందుకు ఇంత వచ్చిందని అధికారులను వారు సమాధానం ఇవ్వడం లేదని వినియోగదారులు చెబుతున్నారు.