కేటీఆర్ కృషితో 1500 కొత్త కంపెనీలు : మంత్రి సబిత

కేటీఆర్ కృషితో 1500 కొత్త కంపెనీలు : మంత్రి సబిత

అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ తాజ్ డెక్కన్‌ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో టీసీఎస్ అయాన్.. టీఎస్ ఆన్ లైన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు ఆగ్మెంట్ ఎంప్లాయిబిలిటి సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీజయేష్ రంజన్,ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, వివిధ యూనివర్సిటీల వీసీలు, విద్యావేత్తలు, పారిశ్రామిక నిపుణులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. లక్షల మంది విద్యార్థులు చదువులయిపోయి బయటికి వస్తున్నారన్న ఆమె... ఉపాధి అవకాశాల కోసం అనేక శిక్షణ కేంద్రాలపై ఆధార పడుతున్నారన్నారు. క్యాంపస్ లోనే చదవాలని విద్యార్థులు కోరుకుంటున్నారని, మూస పద్ధతిలో కాకుండా డిమాండ్ కి తగ్గట్టు చదివే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

ఇదే విషయం సీఎం కేసిఆర్ చెప్తున్నారని మంత్రి సబిత చెప్పారు. ఐటీ పాలసీలు మార్చుతూ కేటీఆర్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారన్నారు. కేటీఆర్ కృషితో 1500 కంపెనీలు హైదరాబాద్ కి వచ్చాయన్న మంత్రి... 7లక్షల మంది జాబులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఆశల మేరకు మన వంతుగా కృషి చేస్తూ ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ఉన్నత విద్యామండలి అధికారులకు ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందలు తెలిపారు. ఇలాంటి సదస్సుల వల్ల రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.