- ఆరోగ్యం లేకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదు: భట్టి
- రాష్ట్రంలో 10 పాథ్ ల్యాబ్‌లు, 25 కస్టమర్ కేర్ సెంటర్లు ప్రారంభం
పద్మారావునగర్, వెలుగు: ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో న్యూబర్గ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన విజయ మెడికల్ సెంటర్ డయాగ్నస్టిక్స్ సేవల విస్తరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 పాథ్ ల్యాబ్‌లు, 25 కస్టమర్ కేర్ సెంటర్లను సోమవారం ఆయన బేగంపేటలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండో శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అన్ని రకాల టెస్టులు చేయాలని, ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. డయాగ్నస్టిక్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ప్రజలపై భారం తగ్గుతుందని, విఫలమైతే మొత్తం వ్యవస్థపై ప్రభావం పడుతుందన్నారు. ఆరోగ్యం మౌలిక అంశమని, ఆరోగ్యం లేకుండా గౌరవం, గౌరవం లేకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాల్లో నాణ్యమైన డయాగ్నస్టిక్ సదుపాయాలు అందితే ప్రజలపై ఆర్థిక, మానసిక భారం తగ్గుతుందని చెప్పారు. వ్యాధిని ముందే గుర్తించే దిశగా ప్రభుత్వ విధానం ఉందని, కచ్చితత్వం, నైతికత, సానుభూతితో సేవలందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కొప్పాక సూర్యనారాయణ, మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ అధినేత డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి, న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ సీఎండీ డాక్టర్ జీఎస్‌కే వేలు పాల్గొన్నారు.
