
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కులగణన చేపట్టి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణన పూర్తి చేశామన్నారు. గురువారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో కులగ ణనపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమంలో భట్టి మాట్లాడారు. ఈ సందర్భంగా కులగణన ప్రక్రియను ఆయన వివరించారు. ‘‘దాదాపు 2 లక్షల మంది సిబ్బందితో 50 రోజుల్లో ఈ సర్వే నిర్వహించాం. మొదటి దశలో వివరాలు ఇవ్వనోళ్లకు రెండోసారి అవకాశం ఇచ్చాం. సర్వేపై పలువురు కోర్టుకు వెళ్లారు.
కోర్టు కూడా కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ మొత్తాన్ని బ్లాక్ లుగా విభజించి సర్వే నిర్వహించాం. ఎలాంటి పొర పాట్లు లేకుండా కులగణన సర్వే చేపట్టాం. 150 ఇండ్లకు ఒక్కో ఎన్యుమరేటర్‌ను నియమించాం. విస్తృత సంప్రదింపులతో కులగణన సర్వేను విజయవంతం చేశాం. ఈ సర్వే రిపోర్టును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ నివేదికను అధ్య యనం చేసేందుకు నిపుణుల కమిటీ సైతం వేశాం. ఆ కమిటీ కొన్ని కీలక సూచనలు చేసింది. వాటిపై కేబినెట్‌లో, అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు భట్టి కృతజ్ఞతలు తెలిపారు.